TS Congress: ఇదేం అనువాదం అయ్యా.. డీకే మీటింగ్ పై కాంగ్రెస్ శ్రేణుల గుస్సా.. ఎందుకంటే?

అనువాదం(ట్రాన్స్‌లేషన్) కాంగ్రెస్‌ను చిక్కుల్లో పడేసింది. తాండూరు సభలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మాట్లాడింది ఒకటైతే కాంగ్రెస్‌ నేత రామ్మోహన్ రెడ్డి అనువదించింది మరొకటి. కర్ణాటకలో 5 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని.. తెలంగాణలో మాత్రం హామీ ఇచ్చిన విధంగా ఉచిత కరెంట్ ఇస్తామని శివకుమార్‌ చెప్పారు. దీన్ని సగమే అనువదించి వదిలేశారు రామ్మోహన్. అటు రేవంత్‌రెడ్డి సీఎం అవుతారంటూ అసలు డీకే శివకుమార్‌ చెప్పనిదాన్ని చెప్పి కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు లేపారు.

New Update
TS Congress: ఇదేం అనువాదం అయ్యా.. డీకే మీటింగ్ పై కాంగ్రెస్ శ్రేణుల గుస్సా.. ఎందుకంటే?

తెలుగులో ఉదయ్‌ కిరణ్‌ నటించిన 'నువ్వు నేను' సినిమా గుర్తింది కదా.. ఆ సినిమాలో ఓ ట్రాన్స్‌లేషన్‌ సీన్‌ అందరికి గుర్తిండే ఉంటుంది. ప్రిన్సిపాల్‌ MS నారాయణ ఇంగ్లీష్‌లో స్టూడెంట్స్‌కు ఇచ్చే స్పీచ్‌ని ధర్మవరపు సుబ్రహ్మణ్యం మక్కికిమక్కికి అనువదిస్తుంటాడు. The Whole College అని నారాయణ అంటే 'కాలేజీలో బొక్క పడింది' అని ధర్మవరపు అనడం ఈ సినిమా బెస్ట్ కామెడీ సీన్స్‌లో ఒకటి. అలాంటి సీనే బయటే రిపీట్ అయితే? అది కూడా రాజకీయ వేదికలపై కనిపిస్తే? అది కూడా ఎన్నికల టైమ్‌లో ఓ పార్టీ ఫుల్‌ జోష్‌లో ఉన్నప్పుడు ట్రాన్స్‌లేషన్‌ నవ్వులు పూయిస్తే? సరిగ్గా అదే జరిగింది. సినిమాలో కాలేజీలో ఎలా అయితే బొక్క పడిందో.. ఇప్పుడు కాంగ్రెస్‌కు అంతకంటే పెద్ద బొక్కే పడింది.


ఇదేం అనువాదం బాబోయ్:
వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్రలో కాంగ్రెస్‌ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ప్రసంగించిన విషయం తెలిసిందే. ఆయన ఇంగ్లీష్‌లో మాట్లాడిన దాన్ని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి తెలుగులోకి అనువదిస్తున్నారు. నిజానికి ట్రాన్స్‌లేషన్‌లో ఉన్నది ఉన్నట్లు చెప్పరు. సదరు వ్యక్తి మాట్లాడుతున్నదాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా అనువదిస్తారు. ఇందులో ఏ మాత్రం తప్పు ఉండదు. కాస్త స్పెస్‌ తీసుకొని ట్రాన్స్‌లేట్ చేయవచ్చు. కానీ మీనింగ్‌ మారేలాగా సొంత స్టోరీ అల్లకూడదు. రామ్మోహన్ రెడ్డి మాత్రం తన సొంత స్టోరీని అల్లేశారు.

ఉచిత కరెంట్ విషయంలో:
ఉచిత కరెంట్ అంశం రాజకీయ పార్టీలకు అతి పెద్ద ఓటు బ్యాంక్. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామన్న హామీ గెలుపుసూత్రాల్లో ఒకటి. కర్ణాటక కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు రైతులకు ఏడు గంటల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పింది. అయితే ఇది చాలా చోట్ల అమలు కావడం లేదంటూ రైతులు రొడెక్కుతున్నారు. ఇదే సమయంలో డీకే శివకుమార్‌ చేసిన తాండూరులో చేసిన వ్యాఖ్యలను తప్పుగా అనువదించారు రామ్మోహన్ రెడ్డి. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు 10వేల వాట్ల విద్యుత్‌ ఉండేదని.. ఇప్పుడు 20వేలకు చేరుకుందని.. అయితే గత బీజేపీ ప్రభుత్వం మాత్రం రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వలేదని విమర్శించారు డీకే. ప్రస్తుతం అధికారంలో ఉన్న తాము(కాంగ్రెస్‌) కర్ణాటకలో 5 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. 7 గంటలు ఇస్తామని కమ్మిట్ అయ్యామన్నారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌ హామీ ఇచ్చినట్లుగా ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. డీకే శివకుమార్‌ ఎక్కడా కూడా తెలంగాణలో 5గంటలే ఇస్తామని చెప్పలేదు. ఇక్కడ హామీ ప్రకారమే కాంగ్రెస్‌ ఉచిత కరెంట్ ఇస్తుందనే చెప్పారు.

కానీ రామ్మోహన్ రెడ్డి ఈ విషయాలను చెప్పకుండా కేవలం గత కర్ణాటక ప్రభుత్వంలో డీకే శివకుమార్‌ పవర్‌ మినిస్టర్‌గా ఉన్నారంటూ అక్కడితో అనువాదాన్ని పూర్తి చేశారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌ కొంపముంచింది. డీకే శివకుమారే స్వయంగా తెలంగాణలో 5 గంటలే ఇస్తామని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే డీకే ఆ మాట అనలేదు.. ఇదంతా ట్రాన్స్‌లేషన్‌లో వచ్చిన పొరపాటు.


మధ్యలో రేవంత్‌ ఎక్కడ నుంచి వచ్చారు?
ఇక ఈ ట్రాన్స్‌లేషన్‌ లొల్లి ఇక్కడితో ఆగలేదు. నవంబర్‌ 30న పోలింగ్‌ జరుగుతుందని, డిసెంబర్ 3న కౌంటింగ్‌ జరిగిన తర్వాత డిసెంబర్‌ 9న తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరుతుందన్నారు డీకే. ఆ రోజు సోనియాగాంధీ పుట్టిన రోజని.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి తొలి అడుగు పడిన రోజుగా చెప్పుకొచ్చారు. అయితే రామ్మోహన్ రెడ్డి ఇక్కడ ట్రాన్స్‌లేషన్‌ని డబ్బింగ్‌ చెప్పినట్లుగా చెప్పకుండా.. రీమేక్ చేశారు. అంటే తన సొంత స్టోరీని అల్లేశారు. డిసెంబర్ 9న ఎల్‌బీ స్టేడియంలో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారంటూ బాంబు పేల్చారు. డీకే శివకుమార్‌ ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడితే రామ్మోహన్ రెడ్డి మాత్రం రేవంత్‌రెడ్డి, ఎల్బీ స్టేడియం, ఉదయం 10గంటల 30నిమిషాలు అంటూ ముహూర్తం కూడా యాడ్‌ చేశారు.


ఈ రెండు విషయాలపై బీఆర్‌ఎస్‌ సెటైర్లు వేస్తోంది. గతంలో రేవంత్‌రెడ్డి రైతులకు మూడు గంటల ఉచిత కరెంట్ చాలు అని అనడం.. ఇప్పుడు డీకే శివకుమార్‌ మాటలను రాంగ్‌గా ట్రాన్స్‌లేట్ అవ్వడంతో కాంగ్రెస్‌ చిక్కుల్లో పడింది. బీఆర్‌ఎస్‌కు మంచి అస్త్రం లభించినట్లుంది. కేటీఆర్‌ సైతం ఇవే విషయాన్ని ప్రస్తావిస్తూ కౌంటర్లు వేస్తున్నారు. నిజానికి కాంగ్రెస్‌కు గతంలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి లేదా దాసోజు శ్రవణ్‌ ట్రాన్స్‌లేట్ చేసేవాళ్లు. శ్రవణ్‌ ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అటు ఉత్తమ్‌ తన నియోజకవర్గంలో బిజీగా ఉన్నారు. దీంతో రామ్మోహన్ రెడ్డి అనువదించారు. అయితే అనుభవం లేకపోవడంతో పాటు బహిరంగ సభల్లో ప్రజలు ఎక్కువ మంది చూస్తున్నరన్న ఫీలింగ్‌తో ట్రాన్స్‌లేటర్లపై ఒత్తిడి ఉంటుంది. అయితే కాంగ్రెస్‌ ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోకపోతే మరిన్ని ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సీరియస్ గా ప్రచారం సాగుతున్న వేళ ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చేలా ఇలాంటి మిస్టేక్స్ ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు