Election King: కేసీఆర్‌పైనే పోటీ..! రాహుల్‌, పీవీ, కరుణానిధి, జయలలితతోనూ తలపడ్డ ఈ ఎలక్షన్‌ కింగ్ ఎవరూ?

కరుణానిధి, జయలలిత, రాహుల్‌గాంధీ, స్టాలిన్‌, పళనిస్వామి, యడ్యూరప్పపై పోటి చేసిన తమిళనాడుకు చెందిన డాక్టర్‌ పద్మరాజన్‌ ఈ సారి కేసీఆర్‌తో తలపడనున్నారు. 237వ సారి నామినేషన్‌ వేసిన ఆయన తెలంగాణ ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు.

New Update
Election King: కేసీఆర్‌పైనే పోటీ..! రాహుల్‌, పీవీ, కరుణానిధి, జయలలితతోనూ తలపడ్డ ఈ ఎలక్షన్‌ కింగ్ ఎవరూ?

Election King Padmarajan: గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎన్నిక ఏదైనా సరే.. బరిలో ఉండాల్సిందే. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రముఖలకు ప్రత్యర్థిగా నిలవాల్సిందే. ముఖ్యమంత్రి, ప్రధాని, చివరకు రాష్ట్రపతి ఎన్నికలైనా వెనకడుగు వేయడం తెలియని వ్యక్తి ఆయన. ఇంతకీ ఆ ఎలక్షన్‌ కింగ్‌ ఎవరు..? ఇప్పటివరుకు ఎన్నిసార్లు ఎన్నికల బరిలో నిలిచారు..? ఎంత ఖర్చు చేశారు..? ఎవరెవరిపై ఆయన పోటీ చేశారు..? రీడ్‌ దిస్‌ స్టోరీ..

ఎవరీ ఎలక్షన్ కింగ్‌?
డాక్టర్‌ పద్మరాజన్‌(Election King Padmarajan).. దేశ రాజకీయాలపై అవగాహన ఉన్న వాళ్లకు పద్మరాజన్‌ సుపరిచితుడే. కానీ సామాన్య ప్రజలకు మాత్రం ఆయన గురించి పెద్దగా తెలియకపోవచ్చు. తమిళనాడు సేలంకు చెందిన 66 ఏళ్ల పద్మరాజన్‌ హోమియోపతి వైద్యుడు. అయితే.. ఈయనకు మరో పేరు కూడా ఉంది. అదే ఎలక్షన్‌ కింగ్‌. ఈ పేరు ఎందుకొచ్చిందంటే.. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా అందులో పోటీ చేస్తుంటారు పద్మరాజన్‌. దేశంలోనే అత్యధిక సార్లు పోటీకి దిగిన అభ్యర్థిగా.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో (India Book of Records) పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో (Limka Book of Records) కూడా చోటు దక్కించుకున్నారు. అయితే.. ఎక్కువ సార్లు పోటీలో నిలబడటమే కాదు.. అత్యధికసార్లు ఓడిపోయిన వ్యక్తిగానూ రికార్డుల్లోకి ఎక్కారు పద్మరాజన్.

Also Read: నేను పోటీ చేయకపోవడానికి కారణం ఇదే.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

1986లో తన సొంత నియోజకవర్గం మెట్టూరు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల్లో నిలబడ్డారు పద్మరాజన్. ఇక అప్పటి నుంచి దేశంలో ఏ ఎన్నిక జరిగినా పోటీకి సై అంటూ వస్తున్నారు పద్మరాజన్‌. వార్డు మెంబర్‌ ఎన్నికల నుంచి రాష్ట్రపతి వరకూ ఎన్నిక ఏదైనా పోటీ చేయాల్సిందే. ఇప్పటివరకూ 5 రాష్ట్రపతి ఎన్నికలు, 5 ఉపరాష్ట్రపతి ఎన్నికలు, 32 లోక్‌సభ, 50 రాజ్యసభ, 72 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 3 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేశారు.

రాష్ట్రపతులతోనూ పోటి:
మాజీ రాష్ట్రపతులు కేఆర్‌ నారాయణ్‌, అబ్దుల్‌ కలాం, ప్రతిభాపాటిల్‌, ప్రణబ్‌ ముఖర్జీలతో పోటీ పడ్డారు. అలాగే.. మాజీ ప్రధానులు అటల్‌ బిహారీ వాజ్‌పేయి, పీవీ నరసింహారావుకు ప్రత్యర్థిగా నామినేషన్‌ వేశారు. 1991లో పీవీ నరసింహారావుపై పోటీ చేసిన పద్మరాజన్‌పై అప్పట్లో దాడి కూడా జరిగింది. అయితే.. వెనకడుగు వేయలేదు. కరుణానిధి, జయలలిత, ఎస్ఎం కృష్ణ, స్టాలిన్, పళనిస్వామి, యడ్యూరప్ప మీద కూడా పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రత్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు.

ప్రత్యర్థి ఎవరైతే నాకేంటి:
ప్రత్యర్థి ఎవరైనా పట్టించుకోని పద్మరాజన్‌.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌(CM KCR)పై పోటీకి సిద్ధమయ్యారు. 237వ సారి నామినేషన్‌ వేశారు. 1986 నుంచి ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాదాపు 20 లక్షలకుపైగా ఖర్చు చేశారు పద్మరాజన్‌. అయితే.. కేవలం నామినేషన్‌ దాఖలు చేసేందుకు చెల్లించాల్సిన రుసుముగానే ఖర్చు చేశారు తప్ప ఏనాడు ఎన్నికల ప్రచారం కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు పద్మరాజన్‌. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా నామినేషన్‌ వేయడంతో పద్మరాజన్‌ను ముద్దుగా ఎలక్షన్‌ కింగ్‌గా పిలుచుకుంటారు.

Also Read: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య.. కారణం ఇదే..

Advertisment
తాజా కథనాలు