బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో వారి జనాభా ప్రాతిపదికన 10 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి అవకాశాల్లోనూ గిరిజన యువతీ, యువకులకు ఈ రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు. ములుగు జిల్లా మేడారంలో కొలువైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మల దర్శనం చేసుకున్న కేంద్రమంత్రి.. తర్వాత మీడియాతో మాట్లాడారు. తెలంగానకు గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని, దీని నిర్మాణానికి తొలి విడతగా దాదాపు రూ.900 కోట్లను కేటాయించడంతో పాటుగా.. ఈ విశ్వవిద్యాలయానికి సమ్మక్క, సారక్క పేరును పెట్టిన ప్రధానమంత్రికి.. గిరిజన సమాజం తరపున, తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
గిరిజనుల కోసమే మేము:
దేశవ్యాప్తంగా.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు, గిరిజన వీరుల త్యాగాలను యావత్ భారతం స్మరించుకునేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన అన్నారు. ఈ సందర్బంగా గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. హైదరాబాద్లో రూ.25 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన స్మారక మ్యూజియం నిర్మాణం చేపట్టబోతున్న విషయాన్ని, 6.5 కోట్ల కేంద్ర నిధులతో గిరిజన పరిశోధన సంస్థ ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయన్నారు. ములుగు జిల్లాలోని రుద్రేశ్వర ఆలయం (రామప్ప గుడి)కి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చే విషయంలోనూ ప్రధానమంత్రి ప్రత్యేక చొరవతీసుకున్న విషయాన్ని ఈ సందర్బంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు.
కిషన్ రెడ్డి ఏం అన్నారంటే?
➼ తెలంగాణ వనదేవతలు, గిరిజనుల ఆరాధ్యదైవం.. సమ్మక్క, సారలమ్మల పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను.
➼ పచ్చని ప్రకృతి నడుమ కొలువై.. ఆదిపరాశక్తి అవతారమైన సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదాలు యావత్ తెలంగాణ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నాను.
➼ దేశంలో ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విషయంలో.. గిరిజన వీరులకు సరైన గౌరవం మర్యాదలు కల్పించే విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.
➼ తెలంగాణ గిరిజన సమాజాభివృద్ధి కోసం.. ఇటీవలే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ములుగులో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాపనకు పచ్చజెండా ఊపడంతోపాటుగా.. రూ.889 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేశారు.
➼ ఈ సెంట్రల్ యూనివర్సిటీకి మన ఆరాధ్యదేవతలైన ‘సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం’గా పేరు పెట్టడం.. గిరిజన సంస్కృతికి, తెలంగాణ సంప్రదాయాలకు మోదీ గారు ఇస్తున్న గౌరవానికి నిదర్శనం.
➼ ఈ యూనివర్సిటీ ద్వారా..తెలంగాణ గిరిజన సమాజం రూపురేఖలే మారిపోతాయి. ఇందులో సందేహం లేదు. మన ములుగు జిల్లాలో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం.. దీనికి మన వన దేవతల పేర్లు పెట్టడం.. రూ.889 కోట్లు కేటాయించిన సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీ అందరి తరపున, తెలంగాణ ప్రజలందరి తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
గిరిజన స్మారక మ్యూజియం నిర్మాణం:
తెలంగాణ గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా.. స్వాతంత్ర్య పోరాటం, రజాకార్ల ఆకృత్యాలపై పోరాడిన గిరిజన వీరులకు సరైన గుర్తింపును ఇస్తూ.. రూ. 34 కోట్లతో హైదరాబాద్ లోని ఆబిడ్స్ లో గిరిజన స్మారక మ్యూజియం నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు కిషన్రెడ్డి. ఇది కాకుండా.. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో విద్యారంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ వర్గాల్లో అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యంతో రూ.420 కోట్లతో.. 17 కొత్త ‘ఏకలవ్య పాఠశాలలను’ కేంద్రం ఏర్పాటుచేసిందని చెప్పారు.
ALSO READ: చంద్రబాబుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట.. అప్పటివరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు!