Telangana elections: 32 + 87 = 119... జనసేన, టీడీపీ పొత్తు లెక్క ఇదే..!

తెలంగాణలో 87 స్థానాల్లో పోటీ చేస్తామంటోంది టీడీపీ. అటు ఇప్పటికే 32 మంది అభ్యర్థులతో లిస్ట్‌ ప్రకటించింది జనసేన. జనసేన సీట్ల జోలికి వెళ్లకుండా టీడీపీ జాబితా ఉండే అవకాశం ఉంది. చంద్రబాబు ఆమోదం కోసం ఇరు పార్టీ నేతల వెయిట్ చేస్తున్నట్టు సమాచారం.

New Update
Telangana elections: 32 + 87 = 119... జనసేన, టీడీపీ పొత్తు లెక్క ఇదే..!

తెలంగాణలో టీడీపీ, జనసేన పొత్తు లెక్క తేలింది. ఏపీతో పాటూ తెలంగాణలోనూ ఇరు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్లనున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన ప్రకటించగా.. తాజాగా 87 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు టీడీపీ ప్రకటించింది. దీంతో ఇరు పార్టీలు కలిసి మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే జనసేన తరఫున పోటీ చేయనున్న 32 మంది అభ్యర్థుల జాబితాను జనసేన ప్రకటించేసింది. ఇప్పుడు మిగిలిన 87 స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ సిద్ధం చేస్తోంది. తెలంగాణలోనూ కలిసే వెళ్లాలని నిర్ణయించుకున్న ఇరు పార్టీలు.. పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై ముందు నుంచే వ్యూహాత్మకంగా పావులు కదిపినట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు పరిశీలించి ఓకే చేయాల్సి ఉంది. ఆ వెంటనే అభ్యర్థుల జాబితాతో పాటూ, మేనిఫెస్టోను కూడా ప్రకటించేందుకు తెలంగాణ టీడీపీ సిద్ధమవుతోంది. అటు ఏపీలో ఇప్పటికే పొత్తు ప్రకటించిన టీడీపీ, జనసేన... బీజేపీ కూడా తమతో కలిసి రావాలని కోరుకుంటున్నాయి. ఈ అంశంలో మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుందని భావిస్తున్నాయి. ఆ వెంటనే తెలంగాణలో ఎన్నికల స్ట్రాటజీ అమలు చేయాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.

బాలకృష్ణకు ప్రచార పగ్గాలు
ఇక తెలంగాణలో ప్రచార బాధ్యతల్ని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అప్పగించేందుకు తెలుగుదేశం అధిష్టానం నిర్ణయించింది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి టీడీపీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించనున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్కిల్‌ కేసులో అరెస్ట్‌ అయ్యి, గత 32 రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. కేసుల విషయంలో ఆయన కోర్టుల్లో చేస్తున్న న్యాయపోరాటం సత్వర ఫలితాలను ఇవ్వటం లేదు. ఎప్పటికప్పుడు విచారణ వాయిదా పడుతూ, తీర్పులు ఆలస్యమవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆ పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, చంద్రబాబు తనయుడిగా నారా లోకేష్‌ పార్టీ బాధ్యతల్ని భుజాన వేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన కూడా కేసులను ఎదుర్కొంటుండటంతో పాటూ.. తండ్రి కేసుల్లో న్యాయ సహాయం, న్యాయ నిపుణులతో సంప్రదింపుల కోసం ఢిల్లీకే పరిమితమయ్యారు. దీంతో రెండు రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలను తిరిగి పట్టాలెక్కించేందుకు సీనియర్లతో పాటూ, కీలక నేతలు ఆయా బాధ్యతల్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతల్ని బాలకృష్ణ చేపట్టనున్నారు.

87 స్థానాల్లో బలమైన అభ్యర్థులు : కాసాని జ్ఞానేశ్వర్‌
తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరాబర్‌ పోటీ చేసి తీరతామని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో సోమవారం ఆయన మాట్లాడారు. గెలుపే లక్ష్యంగా మొత్తం 87 స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించుతున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు ఆమోదముద్ర వేయగానే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామన్నారు. అభ్యర్థుల పేర్లతో పాటు మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామన్నారు. ఇటీవల రాజమహేంద్రవరం జైలులో పార్టీ అధినేత చంద్రబాబును ములాఖత్‌లో కలిసినప్పుడు తెలంగాణలో రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించానన్నారు. పొత్తుల విషయంలో ఇప్పటికే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తమతో సంప్రదింపులు జరిపారనీ, తమ అధినేతతో సంప్రదించి జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లే అంశంపై త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కన్నా టీడీపీ బలంగా ఉందన్న కాసాని.. ఇతర పార్టీల నుండి టీడీపీలోకి వచ్చేందుకు చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో తమ పార్టీ నేతలు ప్రచారంలో ఉన్నారన్న సంగతి ఆయన గుర్తు చేశారు.

మరి బీజేపీ సంగతేంటి?
టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకుని ఏపీలో ముందుకెళ్తుండగా.. వారి పాత మిత్రుడు అయిన బీజేపీ మాత్రం పొత్తు విషయం ఎటూ తేల్చడం లేదు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.. ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి సహా, అక్కడి బీజేపీ నేతలు టీడీపీ, జనసేనతో కూటమి కట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఎటొచ్చీ.. పొత్తులపై తేల్చాల్సింది కేంద్ర అధిష్టానమే కావడంతో ఏపీ వరకూ మూడు పార్టీల నేతలకు ప్రస్తుతానికి ఎదురుచూపులే మిగిలాయి. కాగా, తెలంగాణలో మాత్రం టీడీపీతోకానీ, జనసేనతో కానీ పొత్తుపై టీ-బీజేపీ నేతలు మొదట్నుంచీ ఆసక్తి కనబరచడం లేదు. బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ తాజాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. దీనిపై బీజేపీ నేతలు కూడా ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏమీ కాదేమో కానీ.. తెలంగాణలో ఎంతో కొంత బలమున్న టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తే... ఇక్కడ బీజేపీకి నష్టం జరిగే అవకాశం లేకపోలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Advertisment
తాజా కథనాలు