ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ టికెట్ ను మాజీ మంత్రి దామోదర్ రెడ్డితో (Damodar Reddy) పాటు, రేవంత్ రెడ్డి అనుచరుడైన పటేల్ రమేష్ రెడ్డి (Patel Ramesh Reddy) ఆశిస్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఇంత వరకు ఎటూ తేల్చలేక పెండింగ్ లో పెట్టింది. రేపు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఈ రోజు సాయంత్రంలోగా సూర్యాపేట టికెట్ పై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పార్టీ టికెట్ దక్కని వారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో దామోదర్ రెడ్డి ఆర్టీవీకి (RTV) ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిష్టానంపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. హైకమాండ్ నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు.
ఇది కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి!
కార్యకర్తల అభీష్టం మేరకే ఈ రోజు నామినేషన్ వేస్తున్నానన్నారు. పార్టీ లైన్ దాటనని స్పష్టం చేశారు దామోదర్ రెడ్డి. టికెట్ ప్రకటన ఆలస్యం కావడంపై తనకు ఎలాంటి అసహనం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోందన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందన్నారు. తన అవసరం ఉన్న ప్రతీ చోటకు వెళ్లి పార్టీ కోసం ప్రచారం చేయడానికి సిద్ధం అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 10కి పైగా గెలుచుకుంటుందన్నారు. దామోదర్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను కింది వీడియోలో చూడండి.