ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ హైకమాండ్ (Congress) రాష్ట్రంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా 90 నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దాదాపు అన్ని నియోజకవర్గాలు కవరయ్యేలా ప్రచారం నిర్వహించారు. రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తదితరులు రాష్ట్రాన్ని చుట్టేశారు. రోడ్ షోలు, మీటింగ్ లతో ప్రచారాన్ని హోరెత్తించారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: 63 నియోజకవర్గాలు, 87 సభలు.. రేవంత్ ప్రచారం హైలైట్స్ ఇవే!
రాహుల్ గాంధీ (Rahul Gandhi) మొత్తం 23 సభల్లో పాల్గొనగా.. ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) 26 మీటింగ్స్ లకు హాజరై ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 10 సభలకు హాజరయ్యారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 3, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 10, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భఘేల్ 4 సభల్లో పాల్గొని కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. ప్రచారం చివరి రోజు హైదరాబాద్ లో భారీ రోడ్‌షో నిర్వహించారు.
వివిధ వర్గాలతో రాహుల్ గాంధీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రులు, మాజీ సీఎంలు తెలంగాణను చుట్టేశారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్.. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో ప్రియాంక గాంధీ ఎన్నికల సభలు జరిగాయి. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలో రాహుల్ సభలు నిర్వహించారు.