తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections 2023) సమీపిస్తున్నా కొద్దీ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత కూడా వలసలు ఆగిపోవడం లేదు. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగ్ లు కొనసాగుతూనే ఉన్నాయి. టికెట్ దక్కకపోవడంతో ఈ రోజు అలంపూర్ అభ్యర్థి అబ్రహం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. మరో వైపు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ కు (Kata Srinivas Goud) సొంత సోదరుడు షాక్ ఇచ్చారు. ఆయన అన్న, వదిన ఈ రోజు బీఆర్ఎస్ గూటికి చేరారు. మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) వీరిద్దరికీ ఈ రోజు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పటాన్ చెరులో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కాట శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నుంచి నందీశ్వర్ గౌడ్ బరిలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Breaking News: కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి ఫ్యాక్టరీలో ఐటీ దాడులు
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హ్యాండివ్వడంతో నీలం మధు కూడా ఆఖరి నిమిషంలో బీఎస్పీ నుంచి పోటీకి దిగారు. దీంతో ఈ నాలుగురు అభ్యర్థుల నడుమ హోరాహోరీగా పోరు సాగుతోంది. చతుర్ముఖ పోటీ ఏ అభ్యర్థికి కలిసి వస్తుంది? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి సొంత సోదరుడు షాక్ ఇవ్వడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
పటాన్ చెరు టికెట్ ను తొలుత నీలం మధుకు కేటాయించింది హస్తం పార్టీ. దీంతో అప్పటి వరకు ఆశలు పెట్టుకున్న కాట శ్రీనివాస్ గౌడ్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన అనుచరులు ఏకంగా రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట ధర్నాకు దిగి సంచలనం సృష్టించారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ కాట శ్రీనివాస్ కు మద్దతుగా హైకమాండ్ తో చర్చించారు. శ్రీనివాస్ గౌడ్ కు బీఫామ్ ఇవ్వకుంటే తాను కూడా పోటీ నుంచి తప్పుకుంటానని స్పష్టం చేసినట్లు వార్తలొచ్చాయి. దీంతో వెనక్కుతగ్గిన హైకమాండ్ ఆఖరి నిమిషంలో పటాన్ చెరు అభ్యర్థిని మార్చింది. కాట శ్రీనివాస్ గౌడ్ కు బీఫామ్ అందించింది. దీంతో నీలం మధు బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.