పసుపు బోర్డు(Turmeric board).. తెలంగాణ(Telangana) రైతుల కల.. ఎన్నో ఏళ్లుగా పసుపు బోర్డు కోసం నిజామాబాద్(Nizamabad) రైతులు పోరాడారు. 2019 జనరల్ ఎలక్షన్స్‌లో కేసీఆర్ కూతురు, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత(Kavita) నిజామాబాద్‌లో ఓడిపోవడానికి పసుపు బోర్డు అంశమే కారణమంటారు విశ్లేషకులు. పసుపు బోర్డు తీసుకోస్తానని హామీ ఇచ్చిన ధర్మపూరి అరవింద్(Dharmapuri arvind) ఎంపీగా గెలుపొందారు. అప్పటినుంచి పసుపు బోర్డు ఎప్పుడు ప్రకటిస్తారా అని రైతులు ఎదురుచూశారు. రెండు వారాల క్రితం తెలంగాణకు వచ్చిన మోదీ పసుపు బోర్డు ప్రకటన చేశారు. దీంతో పసుపు రైతులు ఆనందపడ్డారు. తమ కల సాకరం అయిందని సంబరపడ్డారు. పసుపు రైతులకు ఇదొక మైలురాయి అని.. తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్‌లో రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు బీజేపీ చేస్తున్న నిబద్ధతకు ఇదే నిదర్శనమని అరవింద్ ధర్మపురి మోదీని కొనియాడారు. అయితే రెండు వారాలు తిరిగే సరికి పసుపు బోర్డు విషయంలో రైతులు గొందరగోళానికి గురావల్సిన పరిస్థితులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తర్వాత పసుపు రైతులు అయోమయానికి గురవుతున్నారు.
గెజిట్ నోటిఫికేషన్‌లో ఏం ఉంది?
ప్రధాని నేతృత్వంలో సమావేశమైన కేంద్రం కేబినెట్ జాతీయ పసుపు బోర్డుకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే నోటిఫికేషన్‌లో ఎక్కడా కూడా తెలంగాణ అనే పేరు లేదు. దీంతో అసలు పసుపు బోర్డు తెలంగాణలో పెడతారా లేదా అన్నదానిపై కన్ఫ్యూజన్ నెలకొంది. పసుపు బోర్డు ఎక్కడ పెడతారు..? తెలంగాణలో పెడతారా..? ప్రాంతీయంగా ఆఫీస్‌లు పెడతారా లాంటి ఎలాంటి ఇన్ఫో అందులో లేదు. దీంతో అసలు పసుపు బోర్డు ఏర్పాటు ఉంటుందా లేదా అన్నది తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానమూ రాలేదు.
ఎన్నికల్లో మరోసారి ఇదే అస్త్రం కానుందా?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వస్తాయి. రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి కొన్ని రోజుల ముందు.. అక్టోబర్ 1న మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డును కేంద్రం ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. స్వయంగా ప్రధానే ఈ విషయం చెప్పడంతో పసువు బోర్డు నిజామాబాద్‌లో ఫిక్స్ అని అంతా అనుకుంటున్నారు. దేశంలో సాగయ్యే పసుపులో 70శాతం నిమామాబాద్, కరీంనగర్ ప్రాంతాల నుంచే ఉత్పత్తి అవుతుందని లెక్కలు చెబుతున్నాయి. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లోని ఆర్మూర్ ప్రాంతంలో సుమారు 45,000 మంది రైతులు దాదాపు 40,000 ఎకరాల్లో పసుపు పంటను సాగుచేస్తున్నారని తెలుస్తోంది. నిజానికి గతంలో ఈ లెక్క మరింత ఎక్కువగా ఉండేది. అంతకుముందు 55 వేల ఎకరాలకు పైగా సాగు చేయగా, గిట్టుబాటు ధర లేకపోవడంతో రెండేళ్లుగా సాగు విస్తీర్ణం బాగా పడిపోయింది. ఇక రెండు వారాల క్రితం మోదీ చేసిన ప్రకటనతో తమ జీవితాలు మారుతాయని అంతా భావించగా.. నోటిఫికేషన్‌లో తెలంగాణ పేరు లేకపోవడంతో రైతులకు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో నిజామాబాద్‌లో ఇదే అస్త్రంతో బీజేపీ గెలిచింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.
ALSO READ: 26 వారాల అబార్షన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!!