Khammam Politics: ఖమ్మంలో కొత్త రాజకీయం.. కలిసిపోయిన ఏళ్ల నాటి ప్రత్యర్థులు!

Khammam Politics: ఖమ్మంలో కొత్త రాజకీయం.. కలిసిపోయిన ఏళ్ల నాటి ప్రత్యర్థులు!
New Update

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఎప్పటికీ ఉండరని మన నేతలు నిత్యం చెబుతూ ఉంటారు. ఆ మాటలను అనేక మంది నాయకులు ఎప్పటికప్పుడూ నిజం చేస్తూ ఉంటారు కూడా.. తాజా ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక మంది పాత రాజకీయ శత్రువులు మిత్రులై పోయారు. గతంలో హోరాహోరీగా తలపడ్డ నేతలు ఇప్పుడు కలిసిపోయారు. ఒకరి గెలుపు కోసం మరొకరు పని చేస్తున్నారు. అలాంటి లీడర్ల గురించి ఓ లుక్కేద్దాం..

పువ్వాడ, నామా:

గత ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పువ్వాడ అజయ్, మహాకూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా నామా నాగేశ్వర రావు తలపడ్డారు. ఆ ఎన్నికల్లో వీరి మధ్య మాటల తూటాలు పేలాయి. డబ్బులు పంచుతున్నారంటూ ఒకరు.. దొంగ ఓట్లు చేర్పించారంటూ మరొకరు.. దుమ్మెత్తి పోసుకున్నారు. అయితే.. ఆ ఎన్నికల్లో పువ్వాడ విజయం సాధించారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చే నాటికి నామా నాగేశ్వరరావు గులాబీ కండువా కప్పుకుని టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పువ్వాడ గెలుపే లక్ష్యంగా నామా నాగేశ్వరరావు పని చేస్తున్నారు. ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Telangana Elections: కాంగ్రెస్ నేత వివేక్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు..

వైరాలో మదన్ లాల్, రాములు నాయక్:

ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో 2018 లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్, ఇండిపెండెంట్ అభ్యర్థి రాములు నాయక్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ టఫ్ ఫైట్ లో రాములు నాయక్ గెలుపొందారు. అయితే, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో రాములు నాయక్ బీఆర్ఎస్ లో చేరిపోయారు. అయితే, ఈ ఎన్నికల్లో మదన్ లాల్ కే బీఆర్ఎస్ హైకమాండ్ టికెట్ ఖరారు చేసింది. రాములు నాయక్ హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తూ మదన్ లాల్ కు మద్దతు ప్రకటించారు. ఆయన గెలుపుకోసం పని చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Telangana Elections: అర్థరాత్రి ధర్నాకు దిగిన సీతక్క.. కారణమిదేనట..

కలిసిపోయిన తోడళ్లుల్లు:

ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో తోడళ్లుల్ల నడుమ 14 ఏళ్ల పాటు సాగిన రాజకీయ పోరు ఇటీవల ముగిసిపోయింది. వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ కలిసిపోయారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఎడవల్లి కృష్ణ తన తోడళ్లుడు అయిన అప్పటి మంత్రి వనమా వెంకటేశ్వరరావుపై పోటీకి దిగారు. దీంతో ఆ ఎన్నికలు కొత్తగూడెంలో ట్రైయాంగిల్ ఫైట్ గా మారాయి. దీంతో ఆ ఎన్నికల్లో అనూహ్యంగా మహాకూటమి నుంచి సీపీఐ తరఫున పోటీ చేసిన కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. అప్పటి నుంచి వీరి మధ్య మాటల తూటాలు అనేక సార్లు పేలాయి. గత ఎన్నికల సమయం నాటికి ఇద్దరూ కాంగ్రెస్ లోనే ఉన్నా కూడా.. సఖ్యత మాత్రం కుదరలేదు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత వనమా బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. కృష్ణ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగారు. అయితే.. ఈ ఎన్నికల్లో కొత్తగూడెం సీటును కాంగ్రెస్ సీపీఐకి కేటాయించడంతో కృష్ణ బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. ఇద్దరు తోడళ్లుల్లు కలిసిపోయారు. వనమా గెలుపుకోసం కృష్ణ పని చేస్తున్నారు.

సత్తుపల్లి లో సంభాని, సండ్ర

సంభాని చంద్రశేఖర్, సండ్ర వెంకటవీరయ్య నడుమ దాదాపు 30 ఏళ్లుగా రాజకీయ వైరం ఉంది. 1994లో సీపీఎం నుంచి పాలేరులో పోటీ చేసిన సండ్ర తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి సంభాని చంద్రశేఖర్ ను ఓడించారు. తర్వాత అదే నియోజకవర్గంలో రెండు సార్లు సంభాని చంద్రశేఖర్ చేతిలో వెంకటవీరయ్య ఓటమి పాలయ్యారు. ఈ మధ్యలో వెంకటవీరయ్య సీపీఎం ను వీడి టీడీపీలో చేరిపోయారు. తర్వాత పాలేరు జనరల్ కు కేటాయించడంతో వీరిద్దరూ సత్తుపల్లికి మకాం మార్చారు. సత్తుపల్లిలో గత మూడు ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ నుంచి సంభాని తలపడగా.. మూడు సార్లు కూడా విజయం సండ్రనే వరించింది. 2018 ఎన్నికల తర్వాత సండ్ర వెంకటవీరయ్య గులాబీ గూటికి చేరగా.. ఇటీవల కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో సంభాని కూడా బీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో సంభాని తన ముప్పై ఏళ్ల రాజకీయ ప్రత్యర్థికి మిత్రుడిగా మారి.. ఆయన గెలుపుకోసం పని చేయడం అందరినీ ఆకర్షిస్తోంది.

#telangana #telangana-elections-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe