అసలు ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నాక ఇవన్నీ సమస్యలే కాదని టీఆర్ఎస్ నుంచి బీజేపీ లో చేరిన ఓ కీలక నేత అన్నారంటే పరిస్థితి అర్థమవుతుంది. ప్రాంతీయ పార్టీతో ప్రకంపనలు సృష్టించిన ఎన్టీఆర్ 1989లో తనే ఓడిపోవడం ఇందుకో ఉదాహరణ గా ఆయన చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్త రాష్ట్ర సాధన సెంటిమెంట్ ఉన్నా.. పదేళ్ల కాలంతో అది అలాగే ఉండదని తెలుసు. నిజానికి 2018 ఎన్నికల లోనే డబ్బు బాగా ప్రభావం చూపిందంటారు. సంక్షేమ పథకాలు ఉన్నా కాంగ్రెస్ అదే బాట తీసుకుంది. రాజకీయంగా బీజేపీ పై యుద్ధం ప్రకటించి తీవ్రత తగ్గడం మైనార్టీలు, సామాజిక తరగతులపై ప్రతికూలంగా పనిచేయొచ్చు. దేశవ్యాప్తంగా ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మరలుతున్నట్టు పరిశీలనలు చెబుతున్నాయి. బలమైన నేతలు చాలామంది కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి అదే కారణంగా చెబుతున్నారు. టికెట్ వచ్చిన వారు కూడా వెళ్లి పోవడం గతంలో జరిగుండదు. కేసీఆర్ సభల్లో గతంలోని జోష్ తగ్గిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ చొరవతో పార్టీ కొన్ని కొత్త పుంతలు తొక్కుతున్నా.. సరిపోతుందా? ఇంకా ఏం చేయాలనే ప్రశ్న బీఆర్ఎస్ ను వెన్నాడుతోంది. బీజేపీ ఆశించిన స్థాయిలో ఓట్లు చీల్చగల సత్తా చూపలేకపోతోంది. మజ్లీస్ ను కూడా ముస్లిం పెద్దలు గెలిచే సీట్ల కే పరిమితం కమ్మని ఒత్తిడి పెడుతున్నారట.
ఏపీ పరిణామాలు చంద్రబాబు అరెస్ట్ దానిపై భిన్న స్పందనలు, జనసేన-బీజేపీ పొత్తు కూడా సందేహాలు పెంచాయి. తొలి సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చి తర్వాతవి బీఆర్ఎస్ వైపు చూపడం యాదృచ్ఛికమేనా? అయితే గతసారి కూడా అవి ఇలాగే వచ్చాయంటున్న పాలక పార్టీ నిజం గా వాటిని తేలిగ్గా తీసుకోగలదా? కేసీఆర్ చేయించిన సర్వే లలోనూ ఆధిక్యత అంతంత మాత్రంగానే ఉందని ఓ సమాచారం. పులి మీద పుట్రలా ఇప్పుడే మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు రావడం. అయితే ఇవన్ని స్వల్ప విషయాలనీ ప్రజలు కేసీఆర్ తోనే ఉంటారని ఓ నమ్మకం కూడా లేకపోలేదు. ఇన్ని భిన్న అంచనాల మధ్య ఓ స్పష్టత రావాలంటే ఎన్నికల దృశ్యం ఇంకా నిర్దిష్ట రూపం తీసుకోవాలి. ఎవరేంటో.. విధానాలు ఏంటో.. తేలితే ఓటర్లు తామెటో తేల్చుకుంటారు.
-తెలకపల్లి రవి.