హోరాహోరాగా సాగిన తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections 2023) కాంగ్రెస్ కే మెజార్టీ స్థానాలు ఖాయమని అనేక సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. ఫలితాల (Telangana Elections 2023 Results) తర్వాత అత్యంత అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్న ఆ పార్టీ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో మూడు రోజులు హైదరాబాద్‌లోనే డీకే మకాం వేయనున్నారు. ఫలితాల వెల్లడి పూర్తయ్యే వరకు డీకే మానిటర్ చేయనున్నారు. ఫలితాలను బట్టి పార్టీ ఎమ్మెల్యేలపై డీకే టీమ్ నిఘా పెట్టనుంది. ఫలితాల వెల్లడి పూర్తి కాగానే ఒక్కో ఎమ్మెల్యేకు ఇద్దరు కో-ఆర్డినేటర్ల చొప్పున నియామించింది. గెలిచే ఎమ్మెల్యేలతో ఇప్పటికే డీకే టీమ్ ఫోన్‌లో మాట్లాడింది.
ఇది కూడా చదవండి: MLC Kavitha: ఎప్పటికీ మా నాన్నే నా హీరో.. కవిత ట్వీట్ కు అర్థం అదేనా?
ఇప్పటికే డీకే టీమ్ ట్రాకింగ్‌లో ఎమ్మెల్యేలు ఫోన్లు, లోకేషన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఫలితాల వేళ హైదరాబాద్‌కు ఏఐసీసీ దూతలు రానున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ఫలితాల అబ్జర్వర్లుగా సీనియర్ నేతలు చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, సూర్జేవాలాను హైకమాండ్ నియామించింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటీ వస్తే హైదరాబాద్‌లోనే పార్టీ ఎమ్మెల్యేలతో క్యాంప్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎవరికీ మెజార్టీ రాకుండా ఉంటే వెంటనే బెంగళూరు శివారులో క్యాంప్ కు తరలించనున్నారు. ప్రత్యేక విమానాలు లేదంటే ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్యేలను బెంగళూరుకు తీసుకెళ్లనుంది కాంగ్రెస్ హైకమాండ్. బీఆర్ఎస్ వర్గాల నుంచి ఎవరికైనా ఫోన్ వచ్చినా.. ఎలాంటి సంప్రదింపులకు ప్రయత్నాలు చేసినా వెంటనే పార్టీకి సమాచారం ఇవ్వాలని ఇప్పటికే అభ్యర్థులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మనదేనని అభ్యర్థులకు డీకే శివకుమార్ భరోసా కల్పిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.