రెండు దశాబ్దాలకు పైగా ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatreddy) ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఏం చేశారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రశ్నించారు. సోమవారం నల్గొండలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోమటిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నల్గొండ ఎలా ఉంది? మంచి నీళ్ళు వచ్చాయా? కరెంట్ మాటేమిటి? అసలు ఏ పనులైనా చేశాడా? మరి అదే నల్గొండ ఇప్పుడు ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి అన్నారు. గత పదేళ్లలోనే నల్గొండ పట్టణం, నియోజకవర్గం అభివృద్ధి చెందిన విషయం గుర్తించాలన్నారు.
ఇది కూడా చదవండి: TS Elections: కాంగ్రెస్ కు చంద్రబాబు సపోర్ట్.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
నల్గొండ అభివృద్ధి మీ కళ్లముందే ఉందని, ఐటీ టవర్ కూడా వచ్చిందని, ఇక్కడ ఇప్పుడు వెయ్యి పదిహేను వందల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే రూ.200 ఉన్న పెన్షన్‌ను క్రమంగా రూ.2000కు పెంచుకున్నామని గుర్తు చేశారు. యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ రాలేదన్నారు. కానీ ఇప్పుడు మూడు కాలేజీలు ఉన్నాయన్నారు. వందలాది బెడ్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వచ్చిందన్నారు.
బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పూర్తయిందని, లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారని, వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్‌కు బదులు కాంగ్రెస్ పార్టీ భూమాత పోర్టల్ తెస్తామంటున్నారని, అప్పుడు అది భూమాత అవుతుందో.. భూమేత అవుతుందో అని ఎద్దేవా చేశారు.