Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక ఘట్టం ముగిసింది. పోటీలో నిలిచేవారి సంఖ్య తేలింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 119 నియోజకవర్గాలకు గానూ 2,290 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు నవంబర్ 15 వరకు ఉండగా.. చివరి రోజున అంటే బుధవారం 601 మంది తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దాంతో పోటీలో ఉన్నవారి ఫైనల్ లిస్ట్ ప్రకటించింది ఎన్నికల సంఘం.
ఈ వివవరాల ప్రకారం.. నామినేషన్ల ఉపసంహరణ ఎక్కువగా గజ్వేల్ నియోజకవర్గంలోనే జరిగింది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గం నుంచి 70 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దాంతో ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి 44 మంది పోటీలో నిలిచారు. సీఎం పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక రెండవ అత్యధిక నామినేషన్లు దాఖలైన మేడ్చల్ నియోజకవర్గంలో 45 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 22 మంది పోటీలో నిలిచారు.
ఇక జిల్లాల వారీగా చూసుకుంటే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 335 మంది బరిలో ఉన్నారు. అత్యల్పంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోటీ చేస్తున్నారు. ఈ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలుంటే.. 144 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కాగా, స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తులను కేటాయిచింది. దాంతో ఆయా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ తమ గుర్తులపై ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఎన్నికల ప్రచారం నవంబర్ 28తో ముగియనుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 30 వ తేదీన పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read:
మిర్యాలగూడలో ఐటీ దాడులు.. భాస్కరరావు టార్గెట్‌గా సోదాలు..
ఎమ్మెల్సీ కవిత మాస్ డ్యాన్స్.. తగ్గేదేలే అంటున్న గులాబీ శ్రేణులు..!