Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఇవాళ మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులెవరు? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో ఐదు స్థానాల్లో మినహా అభ్యర్థులను ఖరారు చేసింది. వారంతా ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టారు. అయితే కొన్నిచోట్ల అభ్యర్థులకు అసమ్మతి సెగ తగులుతుండడం, మరికొన్ని చోట్ల అభ్యర్థులు నచ్చక కిందిస్థాయి నేతలు రాజీనామాలు చేస్తూ వేరొక పార్టీల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులను మారుస్తారనే ప్రచారమూ జగుతోంది. బీఆర్ఎస్ పరిస్థితి ఇలా వుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇంత వరకూ ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. అభ్యర్థుల ఎంపికపై ఇంకా చర్చలు, సమావేశాలు జరుగుతూనే వున్నాయి.
బీజేపీ స్ర్టాటజీ అదేనా..?
ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన బీజేపీ కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 15 తర్వాత 33 నుంచి 40 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాలో మొదటి లిస్టును విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోలా ఉన్నాయి. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలన్నది తమ ఇష్టమని, నామినేషన్ చివరి రోజు కూడా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం తమ స్ట్రాటజీ అని కూడా వివరించారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే 50 శాతానికి పైగా కసరత్తు పూర్తయిందని చెప్పారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ప్రకటనకు మరింత సమయం పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ దూకుడు పెంచేనా..?
పలు సర్వేలతో రాష్ట్రంలో దూకుడు మీదున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇంకా ఫైనల్ చేయలేదు. ఇప్పటికే పలు సార్లు స్క్రీనింగ్ కమిటీ సమావేశమైనప్పటికీ అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. నిన్న ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సభ్యులతో విడివిడిగా మాట్లాడి సమాచారం సేకరించారు. అయితే.. మరోసారి స్ర్కీనింగ్ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టికెట్ దక్కుతుందని ఆశతో ఉన్న నేతలు మాత్రం త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని కోరుతున్నారు. లేదంటే ఎన్నికల ప్రచారంలో వెనుకబడిపోతామని చెబుతున్నారు. అయితే బీసీ, ఎన్ఎస్ యూఐ, ఇతర అనుబంధ సంఘాల నాయకులు తమకు కూడా టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కమ్మ సామాజికవర్గ నేతలు కూడా ఢిల్లీ వెళ్లి తమకు 10కి పైగా స్థానాలు కేటాయించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈసారి కాంగ్రాస్ కు గెలుపు అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆశావహుల సంఖ్య కూడా భారీగానే వుంది. అలాగే 40 స్థానాలకు సంబంధించి పార్టీ అధిష్టానం మరోసారి పూర్తిస్థాయి సర్వే చేయనున్నట్లు తెలుస్తోంది. సర్వే పూర్తైన తర్వాతే అభ్యర్థులను ఖరారు చేయనుంది. అలాగే ఈ నెల 15న తర్వాత కాంగ్రెస్ బస్సు యాత్ర చేపట్టనుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొనేందుకు రానున్నారు. బస్సు యాత్రలో భాగంగానే రాహుల్, ప్రియాంక గాంధీలు అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తారన్న ప్రచారమూ వుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ త్వరితగతిన అభ్యర్థులను ప్రకటిస్తుందా? లేదా బస్సు యాత్ర ప్రారంభమయ్యాకేనా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.