Telangana Election Polling Percentage: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జోరుగా సాగింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. పలు చోట్ల భారీ సంఖ్యలో క్యూలైన్లలో నిల్చున్నారు ఓటర్లు. తెలంగాణ వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు అంటే పోలింగ్ ముగిసే సమయానికి 63.94 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. వాస్తవానికి గత ఎన్నికలు అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం పోలింగ్ 73.74 శాతం నమోదైంది. కానీ, ఇప్పుడు 5 గంటల వరకే 63 శాతానికి పైగా పోలింగ్ నమోదవడం సంచలనంగా మారింది.
గత ఎన్నికల్లో అంటే 2018లో మధ్యాహ్నం 3 గంటలకు 56.17 శాతం పోలింగ్ నమోదవగా.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయానికి 51.89 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి అదికాస్తా 63 శాతానికి పెరిగింది. మొత్తం పోలింగ్ ముగిస్తే ఈ శాతం మరింత పెరిగి.. గత రికార్డును తిరగరాసే అవకాశం ఉంది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్లలో చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వేచి ఉన్నారు. ఈ లెక్కన చూస్తే.. పోలింగ్ శాతం గత ఎన్నికల్లో నమోదైన 73.74 శాతం రికార్డ్‌ను బ్రేక్ చేయడం ఖాయంగా స్పష్టమవుతోంది. పోలింగ్ ముగిసే సమయానికి మెదక్ జిల్లాలో 80.28 శాతం పోలింగ్ నమోదవగా.. హైదరాబాద్ అత్యల్పంగా 39.97 శాతం నమోదైంది.
పెరిగిన పోలింగ్ శాతం దేనికి సంకేతం..?
సాధారణంగా పోలింగ్ శాతం పెరిగితే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని పొలిటికల్ అనలిస్ట్‌లు అంటారు. అలాగని ఈ వాదనను గట్టిగ సమర్థించడం లేదు. పొలిటికల్ అనలిస్టుల అభిప్రాయం ఇలా ఉంటే.. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు మాత్రం.. పెరిగిన పోలింగ్ తమకే అనుకూలంగా ఉంటుందని ప్రకటించుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలిచి మూడవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా చెప్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పదేళ్ల అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని, అధికారం కాంగ్రెస్ పార్టీదేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు సైతం.. సైలెంట్ ఓటింగ్ జరిగిందని, ప్రజలకు బీజేపీకి అధికారం ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అంచనా ఎలా ఉన్నా.. అసలు ఫలితం మాత్రం తేలాలంటే డిసెంబర్ 3వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే.
Also Read:
హైదరాబాద్ ఓటర్ల మొద్దు నిద్ర..ఇప్పటికీ కేవలం 13 శాతమే పోలింగ్!