Telangana Congress: టీ కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు.. పలువురు నేతల రాజీనామా.. రెబెల్‌గా బరిలోకి..

తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితి ఇప్పుడు ఆగమాగం ఉంది. టికెట్లు దక్కినోళ్లు సంబరపడిపోతూ ప్రచారం మొదలు పెడితే.. టికెట్ దక్కనోళ్లు తీవ్ర ఆవేదన, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమకు టికెట్ దక్కకపోవడానికి టీపీసీసీ చీఫ్ రేవంతే కారణం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్‌ సెకండ్ లిస్ట్‌లో సీట్ కన్ఫామ్ కాని నేతలు కొందరు పార్టీకి రాజీనామాలు చేస్తుంటే.. మరికొందరు రెబల్‌గా పోటీకి సిద్ధమవుతున్నారు. వెంగళరావు, షేక్ అబ్దుల్లా, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి వంటి వారు పార్టీకి రాజీనామా చేయగా.. కొందరు రెబల్‌గా పోటీ చేస్తామన్నారు.

New Update
Telangana Congress: టీ కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు.. పలువురు నేతల రాజీనామా.. రెబెల్‌గా బరిలోకి..

Telangana Congress: ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించిన అనంతరం కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. కొందరు నేతలు పార్టీకి రాజీనామాచేస్తే.. మరికొందరు రెబెల్ అభ్యర్థులుగా రంగంలో దిగుతామని ప్రకటించారు. ఇంత కాలం పార్టీని నమ్ముకుని పని చేసిన తమను పక్కన పెట్టటంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ శాఖ ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్లా సోహెల్‌ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే కూకట్‌పల్లి టికెట్‌ దక్కకపోవటంతో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా చేశారు. ఎల్లారెడ్డిలో రెబెల్ అభ్యర్థిగా రంగంలో ఉంటానని ప్రకటించారు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో సుభాష్‌రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. వడ్డేపల్లికి టికెట్‌ దక్కలేదని ఆయన అనుచరుడు, నాగిరెడ్డిపేట మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాకేష్‌ నిరాశకు గురయ్యాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్టీ కార్యకర్తలు అతన్ని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. అలాగే జూబ్లీహిల్స్‌ టికెట్‌ దక్కకపోవడంతో విష్ణువర్థన్ రెడ్డి అనుచరులు గాంధీభవన్‌లో హల్ చల్ చేశారు.

రెబల్‌గా బరిలో నిలుస్తా: సుభాష్‌ రెడ్డి

ఎల్లారెడ్డిలో రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తా అని సుభాష్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌ పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాదు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌ను గెలవనివ్వనని సవాల్ చేశారు. కామారెడ్డిలోని 4 నియోజకవర్గాల్లో తాను పోటీగా అభ్యర్థులను నిలబెడతా అన్నారు. కామారెడ్డిలో పోటీ చేయాలనుకుంటున్న రేవంత్‌రెడ్డి ఎలా గెలుస్తారో చూస్తా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లోనూ టికెట్‌ ఇవ్వకుండా కాంగ్రెస్‌ మోసం చేసిందని, రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ నన్ను ఆపలేరని వ్యాఖ్యానించారు. ఎల్లారెడ్డిలో కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సుభాష్‌రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. నాయకులను నమ్ముకుంటే నట్టేట ముంచారని కంటతడిపెట్టారు. సొంత పనులన్నింటినీ పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేశానని వాపోయారు.

గాంధీ భవన్‌లో నిరసన..

జూబ్లీహిల్స్ టికెట్‌ విష్ణువర్ధన్‌ రెడ్డికి ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు గాంధీభవన్‌లో నిరసన తెలిపారు. కాంగ్రెస్ కండువాలను దహనం చేశారు. విష్ణు అనుచరులు లోనికి ప్రవేశించకుండా గాంధీభవన్ ప్రధాన ద్వారానికి తాళం వేశారు. దీంతో ఇటుకలతో తాళం పగులగొట్టేందుకు విష్ణువర్ధన్‌ రెడ్డి అనుచరులు ప్రయత్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో పాటు ఆయన ఫొటోలను చించివేశారు.

ఎర్ర శేఖర్‌ మనస్తాపం..

తాను కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తానని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో ఎర్ర శేఖర్‌ మనస్తాపం చెందారు.

పలువురు నేతల రాజీనామా..

మైనారిటీ శాఖ ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్లా సోహెల్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పంపినట్లు సోహెల్‌ తెలిపారు. తెలంగాణలో వాస్తవ కాంగ్రెస్‌ను రేవంత్‌ చంపేశారని ఆరోపించారు. గత 34 సంవత్సరాలు కాంగ్రెస్‌కు సేవ చేశానని ఆయన చెప్పారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ కూకట్‌పల్లి టికెట్‌ను శేరిలింగంపల్లికి చెందిన బండి రమేశ్‌కు కేటాయించింది. దీంతో మనస్తాపానికి గురైన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు పార్టీకి రాజీనామా ప్రకటించారు.

Also Read:

కాంగ్రెస్‌లో వారికి జాక్‌పాట్.. పార్టీలో చేరడమే ఆలస్యం టికెట్ల కేటాయింపు..

 సీఎం జగన్‌ పథకాలపై జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం.. ఫుల్ ఖుషీలో వైసీపీ ఫ్యాన్స్‌..

Advertisment
తాజా కథనాలు