TS Legislative Council: హస్తం గూటికి మరో 6గురు ఎమ్మెల్సీలు.. రేవంత్ కొత్త స్కెచ్ ఇదే?

మండలిలో ఆధిక్యం సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీల చేరికలతో కాంగ్రెస్ బలం 12కు పెరగగా.. మరో 6 గురిని చేర్చుకుని మండలిలో మెజారిటీ సాధించాలన్నది రేవంత్ ప్లాన్ గా తెలుస్తోంది.

New Update
TS Legislative Council: హస్తం గూటికి మరో 6గురు ఎమ్మెల్సీలు.. రేవంత్ కొత్త స్కెచ్ ఇదే?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్సీ హస్తం గూటికి చేరుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కేసీఆర్ కు అత్యంత నమ్మకంగా ఉన్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. ఈ క్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. నిన్న రాత్రి ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లోకి జంప్ కావడంతో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బస్వరాజు సారయ్య, భాను ప్రకాశ్, ప్రభాకర్‌రావు, దండే విఠల్, దయానంద్‌, ఎగ్గే మల్లేశం సైలంట్ గా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ ఊహించని పరిణామంతో బీఆర్ఎస్ లో అలజడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీతో ఇంకా ఎవరెవరు టచ్ లో ఉన్నారనే వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైంది నాయకత్వం.
publive-image

బీఆర్ఎస్ పార్టీకి 25 మంది..
శాసనమండలి మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా.. బీఆర్ఎస్ పార్టీకి 25 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం నలుగురు మాత్రమే సభ్యులు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. మండలిలో బీఆర్ఎస్ దే ఆధిపత్యం అని చెప్పొచ్చు. ఇదే ధీమాతో అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేయాలని బీఆర్ఎస్ ధీమాను ప్రదర్శించింది. శానసమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం బీఆర్ఎస్ సభ్యుడే కావడం తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ భావించింది. ఈ క్రమంలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన ప్రొ.కోదండరామ్, అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణ స్వీకారం ఆలస్యం చేయడం.. అనంతరం కోర్టు స్టే ఇవ్వడం జరిగిపోయింది. శాసనమండలి ఛైర్మన్ బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించి కావాలనే వీరి ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేశాడన్న చర్చ కూడా ఆ సమయంలో సాగింది.
publive-image

ఫలించిన రేవంత్ వ్యూహం..
ఈ పరిణామాలతో సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేలా వ్యూహాలు రచించారు. ఇందుకోసం గుత్తా అంటే గిట్టని ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలను ఒప్పించారు. ఈ క్రమంలో అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు. సుఖేందర్ రెడ్డి సైతం పార్లమెంట్ ఎన్నికల సమయంలో పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. దీంతో వచ్చే శాసనమండలి సమావేశాల్లో సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్‌ఎస్ స్కెచ్ వేసింది. తమకు ఉన్న బలంతో ఆయనను ఛైర్మన్ పీఠం నుంచి దించాలని భావించింది. ఇది గమనించిన అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేయడం ప్రారంభించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు గాలం వేసింది. ఈ క్రమంలో ఒకే సారి ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుంది. దీంతో కాంగ్రెస్ బలం ఇప్పుడు 12కు చేరింది. బీఆర్ఎస్ బలం 17కు పడి పోయింది.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు:
1.టీ.జీవన్ రెడ్డి
2.తీన్మార్ మల్లన్న
3.మహేశ్ కుమార్ గౌడ్
4.బల్మూర్ వెంకట్

బీఆర్ఎస్ నుంచి గతంలో చేరిన వారు:
5.కూచుకుళ్ల దామోదర్ రెడ్డి
6.పట్నం మహేందర్ రెడ్డి
publive-image

తాజాగా చేరిన వారు:
7. బస్వరాజు సారయ్య
8. భాను ప్రకాశ్
9. ప్రభాకర్‌రావు
10. దండే విఠల్
11. దయానంద్‌
12. ఎగ్గే మల్లేశం

గవర్నర్ కోటాలో మరో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ అంశం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. అయితే.. ఈ రెండు కూడా కాంగ్రెస్ కే దక్కే అవకాశం ఉంది. అప్పుడు కాంగ్రెస్ బలం 14కు చేరుతుంది. మరో ఐదారుగురు ఎమ్మెల్సీలు చేరితే కాంగ్రెస్ మండలిలో మెజార్టీ దక్కనుంది. కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన అలుగుబెల్లి నర్సిరెడ్డి సైతం కాంగ్రెస్ కే మద్దతుగా ఉండే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు