తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (TS CM Revanth Reddy), నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఈ రోజు ఢిల్లీలో యూపీఎస్సీ (UPSC) చైర్మన్ మనోజ్ సోనిని కలిశారు. నియామక పరీక్షల నిర్వహణకు వారు అవలంభిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించి పలు విషయాలను యూపీఎస్సీ చైర్మన్ తో వారు చర్చించినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ (TSPSC) అధికారుల కమిటీ సైతం ఒకటి రెండు రోజుల్లో యూపీఎస్సీని (UPSC) సందర్శించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం వారు ప్రభుత్వానికి నివేదిక సమర్పించానున్నారు. ఆ నివేదిక ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఇది కూడా చదవండి: TS Police Jobs: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు!
ఇప్పటికే సభ్యుల రాజీనామా..
ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు రాజీనామా చేశారు. అయితే.. గవర్నర్ వీరి రాజీనామాలను ఇంత వరకు ఆమోదించలేదు. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా గవర్నర్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను త్వరగా ఆమోదించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ నాలుగైదు రోజుల్లోనే గవర్నర్ వీరి రాజీనామాలను ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం.. వెంటనే కొత్త బోర్డును ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అనంతరం వెంటనే నోటిఫికేషన్ల విడుదలకు చర్యలు చేపట్టాలన్ని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
ప్రక్షాళన ఎందుకు?
పేపర్ లీకేజీ వ్యవహారంతో గత టీఎస్పీఎస్సీ బోర్డు అనేక విమర్శలు ఎదుర్కొంది. ఏకంగా రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైన గ్రూప్-1 నియామక పరీక్ష పేపర్ కూడా లీక్ కావడం రాష్ట్రంలోని నిరుద్యోగులు బోర్డుపై నమ్మకం కోల్పోయేలా చేసింది. అయితే.. ఆ పరీక్ష రద్దు చేసిన తర్వాత కనీస జాగ్రత్తలు చేపట్టకుండా మళ్లీ నిర్వహించింది టీఎస్పీఎస్సీ. దీంతో పరీక్ష నిర్వహణలో నిబంధనలు సరిగా పాటించలేదన్న కారణంతో మరో సారి ఆ ఎగ్జామ్ ను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. దీంతో నిరుద్యోగులు బోర్డుపై దుమ్మెత్తి పోశారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రధాన అస్త్రం..
ఎన్నికల సమయంలో నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ టీఎస్పీఎస్సీ వ్యవహారాన్ని అస్త్రంగా మార్చుకుంది. తాము అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే.. జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని ప్రకటించింది. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల తేదీలను సైతం మేనిఫెస్టోలో పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి, కాంగ్రెస్ పార్టీ విజయానికి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కూడా ఓ కారణమన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళించే పనిలో కాంగ్రెస్ సర్కార్ నిమగ్నమైంది.