ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఈ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు ఈ సందర్భంగా సీఎం సూచించారు. సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ధరణి సవరణలపై అఖిలపక్ష సమావేశం పెడుదామని, ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుందామని అన్నారు.
అందరి సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందిద్దామన్నారు. అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామన్నారు రేవంత్. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. అయితే.. ధరణిని రద్దు చేస్తూ భూ సమస్యలు మళ్లీ మొదటికి వస్తాయని బీఆర్ఎస్ వాదించింది.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ధరణి సవరణలపై అఖిలపక్షం నిర్వహిస్తామని ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ ప్రారంభమైంది. ఈ అఖిలపక్ష సమావేశానికి కేసీఆర్ హాజరవుతారా? లేక పార్టీ ప్రతినిధులు హాజరవుతారా? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. వారు హాజరైతే ఎలాంటి అభిప్రాయం చెబుతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది.