TSPSC: గ్రూప్ 2 రీషెడ్యూల్!.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు

టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీపై నిర్వహించిన సమీక్షలో కీలక అంశాలపై నిర్ణయాలకు వచ్చినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీకి కొత్త సభ్యుల నియామకంతో పాటు, పరీక్షల రీషెడ్యూలుపై కూడా స్పష్టతకు వచ్చారు.

New Update
TSPSC: గ్రూప్ 2 రీషెడ్యూల్!.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు

TSPSC Group 2: టీఎస్పీఎస్సీ సమూల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. వివిధ శాఖలతో భేటీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టీఎస్పీఎస్సీపై నిర్వహించిన సమీక్షలో పలు కీలక అంశాలపై చర్చించారు. బోర్డు ప్రక్షాళన, కొత్త సభ్యుల నియామకం, ప్రస్తుత పరీక్షల స్థితిగతులు, మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం షెడ్యూలుకు ప్రణాళిక వంటి అంశాలపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు.

పరీక్షల రీషెడ్యూల్?
ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువరించిన అన్ని పరీక్షలనూ రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ తేదీలకు అనుగుణంగా మార్పులు చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే జనవరిలో నిర్వహించాలని నిర్ణయించిన గ్రూప్ 2 పరీక్ష కూడా రీషెడ్యూల్ చేయాలని భావిస్తున్నారు. దాదాపు ఐదున్నర లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న గ్రూప్ 2 (Group 2) పరీక్ష వివిధ కారణాలతో ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడింది. ఈ పరీక్షపై అప్డేట్ కోసం నిరుద్యోగ అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఇటీవల పరీక్ష సెంటర్లను సిద్ధం చేయాలంటూ టీఎస్పీఎస్సీ (TSPSC) విడుదల చేసిన ప్రకటన ఆశావహుల్లో చర్చనీయాంశమైంది. ఆ ప్రక్రియ అలా సాగుతుండగానే సోమవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన రాజీనామా పెండింగ్ లో ఉందని, గవర్నర్ ఇంకా దానిని ఆమోదించలేదని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: వచ్చే ఏడాది మొత్తం 27 సెలవులు.. లిస్ట్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్!

చైర్మన్ రాజీనామా.. కొత్త సభ్యుల కోసం కసరత్తు
టీఎస్పీఎస్సీని (TSPSC) పూర్తిగా ప్రక్షాళన చేసి పూర్తి పారదర్శకతతో పరీక్షలు నిర్వహించేలా కొత్త సభ్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే చైర్మన్ రాజీనామా చేయగా, సభ్యులు కూడా త్వరలోనే రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వారి నుంచి వివరణ కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీఎస్పీఎస్సీకి కొత్తగా ఏర్పాటు చేయబోయే బోర్డును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాజకీయాలకు దూరంగా ఉన్నవారిని ఆ పదవుల్లో నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే విద్యావేత్తలు, ప్రొఫెసర్లకు టీఎస్పీఎస్సీలో అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: రాజధానిని విశాఖకు తరలించడం లేదు.. హైకోర్టులో జగన్ సర్కార్ అఫిడవిట్‌

పేపర్ లీకేజీలు, పరీక్షల వరుస వాయిదాలతో మసకబారిన బోర్డు ప్రతిష్ఠను తిరిగి పునరుద్ధరించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే, ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లను కొనసాగిస్తూ వాటికి పరీక్షలు నిర్వహిస్తారా.. లేదా వాటిని రద్దు చేసి పోస్టుల సంఖ్యను పెంచి కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తారా.. అన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు