దశాబ్ది వేడుకల్లో భాగంగా వైద్యారోగ్యశాఖ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఉత్సవాల్లో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు తొమ్మిదేళ్లలో వైద్యారోగ్య రంగంలో సాధించిన అభివృద్ధిని గుర్తుచేస్తూ చరిత్రలో నిలిచిపోయేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం చేతుల మీదుగా నిమ్స్ కొత్త బ్లాక్‌కు శంకుస్థాపన, రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీతో పాటు.. పీహెచ్సీ స్థాయిలోనూ ఆరోగ్య దినోత్సవాలను అధికార యంత్రాంగం పెద్దఎత్తున నిర్వహించనుంది.
32 ఎకరాల్లో 15 వందల 71 కోట్ల రూపాయలతో రూపుదిద్దుకోనున్న 2 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. నూతన బ్లాక్‌కు సీఎం శంకుస్ధాపన చేయనున్నందున నిమ్స్‌లో ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించనున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
మరోవైపు రాష్ట్రంలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణి కోసం 277 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ఇప్పటికే రాష్ట్రంలో 9 జిల్లాల్లో అమలవుతుండగా న్యూట్రిషన్ కిట్లు తీసుకున్న మహిళల్లో రక్తహీనత తగ్గుతోందని గుర్తించిన సర్కార్ కిట్ల పంపిణీ చేయనుంది. నిమ్స్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా ఈ పథకాన్ని మిగిలిన 24 జిల్లాలకు విస్తరింపజేయనున్నారు. ఈ సందర్బంగా మహిళలకు సీఎం కేసీఆర్ కిట్లను అందించనున్నారు. దీంతో రాష్ట్రంలోని 6.8 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరే అవకాశం ఉంది.