Amrabad Tiger Reserve: ప్లాస్టిక్ రహిత జోన్‌గా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్.. సీఎస్ కీలక ఆదేశాలు!

జూలై నెలాఖరులోగా 'అమ్రాబాద్ టైగర్ రిజర్వ్' ను పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్‌గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మైసమ్మ ఆలయంలో ప్లాస్టిక్‌ వాడకం నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

New Update
Amrabad Tiger Reserve: ప్లాస్టిక్ రహిత జోన్‌గా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్.. సీఎస్ కీలక ఆదేశాలు!

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ రోజు అటవీశాక, ఎండోమెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో ప్లాస్టిక్ నిషేధంపై చర్చించారు. జూలై నెలాఖరులోగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్' ను పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్‌గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. కాగితపు సంచులు, గుడ్డ/జనపనార సంచులు, విస్తరాకులు మొదలైన పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని నివారించి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో అదనపు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలలో ప్రచారంతో పాటు పంచాయతీలలో, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని, టైగర్ రిజర్వ్ ఏరియాలో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం గురించి హైవే వెంట ఉన్న స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించాలని అన్నారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోని నాలుగు ఆవాసాల్లో నివాసముంటున్న ప్రజలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. హరిత నిధి కింద ఉన్న నిధులను సంబంధిత వార్షిక సంవత్సరంలోనే వినియోగించుకోవాలని అన్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 'మైసమ్మ దేవాలయం'లో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్‌ శాఖ అధికారులను సీఎస్‌ కోరారు. సమీక్షలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, PCCF ఆర్. యం. డోబ్రియాల్, TSPCB సభ్య కార్యదర్శి బుద్ధ ప్రకాష్ జ్యోతి, కమిషనర్ ఎండోమెంట్స్ హనుమంత రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు