బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మహిళలకు శుభవార్త చెప్పారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఉమ్మడి ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్నతరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ స్కీమ్ ద్వారా ద్వారా ప్రతీ సంవత్సరం 5,000 గ్రామీణ సంఘాలకు, ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు ప్రయోజనం చేకూరేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రానున్న ఐదేళ్లలో 25,000 సంస్థలకు విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో 63 లక్షల మహిళలను విజయవంతమైన వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు భట్టి విక్రమార్క.
ఈ లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసినట్లు చెప్పారు. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. తద్వారా ఈ లక్ష్యం సాధిస్తామని వివరించారు. మహిళలకు ఈ స్కీమ్ ద్వారా వారికి ఇంట్రెస్ట్ ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామన్నారు. దాంతో పాటు బ్రాండింగ్, మార్కెటింగ్ చేయడంతో మెలకువలు పెంపొందేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
ఈ ఏడాది మార్చిలో ఇందిరా మహిళా శక్తి పథకంలో రుణ బీమా పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఈ పథకం కింద సభ్యురాలు చనిపోతే.. ఆమె పేరుపై ఉన్న అప్పును గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామన్నారు. ఈ స్కీమ్ కోసం రూ. 50.41 కోట్లు కేటాయించామన్నారు.
ఇందిరా జీవిత బీమా స్కీమ్
స్వయం సహాయక సంఘాల్లోని 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు ఈ స్కీమ్ కింద జీవిత బీమా అందిస్తున్నట్లు మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే.. వారికి 10 లక్షల జీవిత బీమా చేయనున్నట్లు చెప్పారు.
గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో స్వయం సహాయక సంఘాలు కుంటుపడ్డాయని ఆర్థిక మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా సంఘాల పునరుద్ధరణకు ప్రతీ సంవత్సరానికి కనీసం 20 వేల కోట్లకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.