ఈ రోజు అసెంబ్లీలో రూ.2.91 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా తాము బడ్జెట్ ను రూపొందించామని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే.. తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మహిళలకు నిరాశే మిగిలింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.2500 పథకంపై ప్రకటన వస్తుందని రాష్ట్రంలోని మహిళలు ఆశించారు. అయితే.. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ అంశాన్ని అసలు ప్రస్తావించకపోవడంపై మహిళల్లో నిరాశ వ్యక్తం అవుతోంది.
ఇది కూడా చదవండి: TG Farmer Loan Wavier: రుణమాఫీ కాని రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి!
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహాలక్ష్మి స్కీం కింద మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ స్కీమ్ అమలు కోసం మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. బడ్జెట్ లో ఈ స్కీమ్ గురించి ప్రస్తావించకపోవడంతో ఈ ఏడాది దాదాపు ఈ పథకం అమలు లేనట్టేనని తెలుస్తోంది. అయితే.. ఈ స్కీమ్ ను ఎప్పటి నుంచి ప్రారంభించినా కఠిన నిబంధనలు పెట్టే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
ప్రభుత్వం అందించే ఏ స్కీంలోనూ లబ్ధిదారులుగా లేని మహిళలకే ఈ పథకాన్ని వర్తింప జేసే అవకాశం ఉందని సమాచారం. ఇంకా భర్త ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే భార్యకు ఈ స్కీం వర్తించదన్న రూల్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఈ స్కీమ్ విధి విధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం త్వరలో కమిటీని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana Budget 2024: తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు.. సర్కార్ ను చీల్చి చెండాడుతాం: కేసీఆర్