తెలంగాణలో బతుకమ్మ సంబరాలు (Bathukamma Festival) ఈ రోజు నుంచే ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఈ పూల జాతర.. ఊరూ వాడా కొనసాగనుంది. తొలి రోజు నిర్వహించే బతుకమ్మ సంబరాలను ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు. ఇంకా.. బతుకమ్మ వేడుకలు పెత్ర అమావాస్య రోజు ప్రారంభం అవుతాయి. ఈ రోజు పెద్దల ఆత్మకు శాంతి కలగాలని అనేక రకాల వంటలు చేసి వారికి తర్పనాలు ఇస్తారు. కొన్ని ప్రాంతాల్లో పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు బియ్యం ఇస్తారు. అలా ఇచ్చిన తర్వాత భోజనం చేసి.. తెలంగాణ పల్లె భాషలో చెప్పాలంటే ఎంగిలి పడి బతుకమ్మను పేరుస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతుంటారు. కొన్ని చోట్లు ఈ పేరు రావడానికి మరో కారణం ఉందని చెబుతారు. తొలిరోజు బతుకమ్మ మరింత పెద్దదిగా ఉండడానికి ఒకరోజు ముందుగానే పూలను సేకరించి.. భారీగా పూలతో బతుకమ్మను పేరుస్తారు. దీంతో ఒక రోజు ముందుగానే పూలను తీసుకువచ్చి ఓ రాత్రంతా ఉంచుతారు కాబట్టి కూడా ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు.
ఇది కూడా చదవండి: Bathukamma 2023 : బతుకమ్మ కంటే ముందు నిర్వహించే బొడ్డెమ్మ పండుగ…ప్రాధాన్యత..!!
ఈ రోజు బతుకమ్మకు నైవేద్యం: నూకలు, బియ్యం, బెల్లం, నువ్వులు, బియ్యం
పండుగ ప్రారంభం (ఎంగిలిపూల బతుకమ్మ) సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందని సీఎం అన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ, తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తున్నదని అన్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై, ఉత్సవాల ముగింపు రోజైన 'సద్దుల బతుకమ్మ' దాకా తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలంతా ఆటా పాటలతో కోలాట చప్పట్లతో కలిసికట్టుగా జరుపుకునే బతుకమ్మ సంబురాలతో, తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక పండుగ శోభ సంతరించుకుంటుందని సీఎం అన్నారు.