ఫిరాయింపులతో బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే హస్తం పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తాజాగా కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. గైర్హాజరైన వారిలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఉన్నారు.
వీరితో పాటు ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి కూడా బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ కు రాలేదు. దీంతో వీరంతా హస్తం గూటికి చేరేందుకు సిద్ధం అవుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బండారు లక్ష్మారెడ్డి మాత్రం జపాన్ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణం చేతనే ఆయన బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ కు హాజరు కాలేదని సమాచారం. ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి కాంగ్రెస్లో చేరడం ఖాయమైనట్లు సమాచారం.