మంగళవారం అత్యధికంగా మియాపూర్ లో 4.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని షేక్ పేట, జూబ్లీహిల్స్ లో 4.1, మాదాపూర్ లో 3.7, కృష్ణానగర్ లో 3.5, చార్మినార్ 3.3, విజయనగర్ కాలనీలో 3.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. చిన్న చిన్న వర్షానికే బైలెన్‌లలో నీళ్లు నిలిచిపోతున్నాయి.మరోవైపు వాతావరణశాఖ తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 30-40 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది.
మూడురోజుల పాటు విస్తారంగా వర్షాలు
రాష్ట్రంలో మరో మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. ఫలితంగా కాళేశ్వరం వద్ద క్రమక్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. వర్షం కారణంగా.. భూపాలపల్లిలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో సమీక్షించి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల ముప్పు కారణంగా… ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదురొనేందుకు సిద్ధంగా ఉండేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.