TDP Vs YCP war over sand mafia: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. ఏపీలో అధికార వైసీపీ ఇసుక దోపిడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ టీడీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇసుక దోపిడీపై ఇవాళ, రేపు, ఎల్లుండు నిరసనలకు ప్లాన్ చేసింది టీడీపీ. మైలవరంలోని ఇసుక డంపింగ్ స్టాక్ పాయింట్ వద్ద టీడీపీ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమా, తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి శావల దేవదత్ నిరసనకు దిగగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగగా.. టీడీపీ నేతల అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.
అనేక ఆరోపణలు.. ఏది నిజం?
వైసీపీ ప్రభుత్వం ఇసుక దోపిడి చేస్తుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదేపదే ఆరోపిస్తూ వస్తున్నారు. మైనర్ మినరల్స్ తవ్వకాలు జరిపి నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తూ రూ.40 వేల కోట్లు ఆర్జించిన ఇసుక మాఫియా వెనుక వైసీపీ నేతల హస్తం ఉందన్నది ఆయన ప్రధాన ఆరోపణ. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT), సుప్రీంకోర్టు కూడా దీనిని సమర్థించిందని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఇసుక మాఫియాకు సీఎం జగన్ మౌనంగా మద్దతు ఇస్తున్నారని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు 'హోల్‌సేల్ డీలర్లుగా' మారారని వాదిస్తున్నారు చంద్రబాబు. ఆరోపణలకు సంబంధించి తన వద్ద డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ, సీఎం జగన్ 48 గంటల్లో వివరణ ఇవ్వాలని, ఆ తర్వాత కుంభకోణాన్ని బయటపెట్టడంపై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని గత శుక్రవారం డిమాండ్ చేశారు చంద్రబాబు.
చంద్రబాబు ప్రధాన ఆరోపణ ఏంటి?
వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో దాదాపు 40 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వి బ్లాక్‌లలో టన్నుకు రూ.1,000 చొప్పున విక్రయించిందన్నది చంద్రబాబు ప్రధాన ఆరోపణ. టీడీపీ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని జగన్ రద్దు చేయడంతో దాదాపు 40 లక్షల మందికి పైగా భవన నిర్మాణ కార్మికులు జీవనోపాధి కోల్పోయారని చంద్రబాబు అనేకసార్లు విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం ఇసుక తవ్వకాల కార్యకలాపాలను మొదట ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించిందని, ఆ తర్వాత ఇసుక తవ్వకాలు, అమ్మకాలలో అనుభవం లేని జైప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (JPVL)కి అప్పగించిందని విమర్శిస్తోంది టీడీపీ. ఇదే సమయంలో ఆందోళలనకు పిలుపునివ్వగా పోలీసులు అడ్డుకున్నారు.
ALSO READ: ఢిల్లీకి చేరిన దొంగ ఓట్ల పంచాయతీ.. ఈసీకి వైసీపీ, టీడీపీ పోటాపోటీ ఫిర్యాదులు!