Chandrababu: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో (AP Elections 2024) గెలుపే లక్ష్యంగా టీడీపీ (TDP) వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా టికెట్లు దక్కని వారు చేజారి నష్టం చేయకుండా చర్యలు ప్రారంభించింది. బుజ్జగింపుల్లో భాగంగా వారికి పార్టీ పదవులను ఇవ్వడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని నియమించింది.పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్, విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా గండి బాబ్జీ, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బీవీ వెంకట రాముడు, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్, మన్నె సుబ్బారెడ్డి, కొవ్వలి రామ్మోహన్ నాయుడును పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) నియమించారు. వీరితో పాటు పార్టీ కార్యదర్శులుగా ముదునూరి మురళీకృష్ణం రాజు, వాసురెడ్డి ఏసుదాసును నియమించింది టీడీపీ.
ఇది కూడా చదవండి: Budi Mutyala Naidu: ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం జగన్
చంద్రబాబునాయిడు వరుసగా రెండో రోజు కుప్పంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ' ప్రచారంలో భాగంగా మంగళవారం కుప్పంలోని బాబు నగర్ లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటింటికీ తిరుగతూ తమ ప్రభుత్వం వచ్చాక అమలు చేయబోయే సూపర్-6 పథకాల గురించి మహిళలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ప్రజలు తమ సమస్యలను చంద్రబాబు గారికి చెప్పుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఏలూరులో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. మాజీ ఎంపీ మాగంటి బాబు వైసీపీలో చేరడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. ఈ మేరకు హైదరాబాద్ లో వైసీపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏలూరు ఎంపీ టికెట్ ను టీడీపీ పుట్టా మహేష్ యాదవ్ కు కేటాయించింది. దీంతో మాగంటి బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2014లో ఇదే నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా విజయం సాధించారు. 2019లో ఓటమి పాలయ్యారు. ఈ సారి యనమల రామకృష్ణుడి కారణంగానే తనకు టికెట్ రాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.