దొంగ ఓట్లపై సీఈసీకి పరస్పరం ఫిర్యాదు చేసుకున్న టీడీపీ, వైసీపీ

ఏపీలో ఓట్ల గల్లంతు రాజకీయం ఢిల్లీ చేరుకుంది. తమ పార్టీ మద్దతుదారుల ఓట్లను వైసీపీ తొలగిస్తుందని టీడీపీ ఆరోపణలు చేస్తుంటే.. ఓట్లు గల్లంతు చేసే నీచ రాజకీయం టీడీపీదే అంటూ వైసీపీ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు.

దొంగ ఓట్లపై సీఈసీకి పరస్పరం ఫిర్యాదు చేసుకున్న టీడీపీ, వైసీపీ
New Update

ఢిల్లీ చేరుకున్న ఏపీ దొంగ ఓట్ల రాజకీయం..

ఏపీలో ఓట్ల గల్లంతు రాజకీయం ఢిల్లీ చేరుకుంది. తమ పార్టీ మద్దతుదారుల ఓట్లను వైసీపీ తొలగిస్తుందని టీడీపీ ఆరోపణలు చేస్తుంటే.. ఓట్లు గల్లంతు చేసే నీచ రాజకీయం టీడీపీదే అంటూ వైసీపీ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కలిసి ఓట్ల గల్లంతుపై ఫిర్యాదుచేశారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ నాయకుల రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రాష్ట్ర ఎన్నికల అధికారులు స్వతంత్రంగా పనిచేయడానికి వీలుపడడం లేదని తెలిపారు. 2024లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఇప్పటికే 60 లక్షలకు పైగా ఓట్లను వైసీపీ నేతలు తొలగించారన్నారు.

హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరాం..

ఉరవకొండ లాంటి ఘటనలు అన్ని చోట్ల జరుగుతాయని చంద్రబాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాలంటీర్లతో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఢిల్లీ వచ్చానన్నారు. ఒక పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలన్న అలోచన ఇంతవరకు ఏ పార్టీకి రాలేదని.. వైసీపీకి ఇలాంటి ఆలోచన రావడం దుర్మార్గమని మండిపడ్డారు. వైసీపీ చేసిన దారుణాలను సాక్ష్యాధారాలతో ఈసీకి సమర్పించామని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినట్లుగా వివరించారు. అవసరమైతే హైపవర్ కమిటీని, వేరే రాష్ట్రాల నుంచి అబ్జర్వర్లను ఏర్పాటు చేయాలని సూచించామని బాబు వెల్లడించారు.

ఆధార్ కార్డుకు ఓటర్ కార్డు లింక్ చేయాలి..

మరోవైపు చంద్రబాబు ఫిర్యాదుకు పోటీగా విజయసాయిరెడ్డి నేతృతంలోని వైసీపీ ఎంపీల బృందం కూడా సీఈసీని కలిసి ఫిర్యాదుచేశారు. ఆధార్ కార్డుకు ఓటర్ కార్డు లింక్ చేయాలని కోరామని విజయసాయిరెడ్డి తెలిపారు. అలా చేస్తారేమోనని చంద్రబాబు బాధపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఒలింపిక్స్‌లో దొంగ ఓట్ల పోటీ పెడితే చంద్రబాబు కచ్చితంగా విజయం సాధిస్తారని ఎద్దేవా చేశారు. 2014-19 వరకు బాబు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించారని.. 2014 నుంచి చేర్చిన దొంగ ఓట్లపై ఈసీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సేవా మిత్ర, మై టీడీపీ యాప్ ద్వారా భోగస్ ఓట్లు నమోదుచేశారని.. ఆ సమాచారాన్ని ఈసీకి ఇచ్చామన్నారు. 2019లో 3,98,34776 ఓట్లు ఉంటే, ఇప్పుడు 3,97,96,678 ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. ఎవరైనా ఓటర్ క్యాస్ట్ గురించి అడుగుతారా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. మొత్తానికి ఏపీ రాజకీయాలు ఓట్ల గల్లంతు అంశం చుట్టూనే తిరుగుతున్నాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి