రైతుపై దాడి.. ట్రక్కుతో పరారు..
'టమటా.. టమాటా.. నువ్వు ఏం చేస్తావంటే దొంగతనాలు చేయిస్తా.. మర్డర్స్ చేయిస్తా.. భార్యాభర్తలను విడగొడతా.. కొంతమంది రైతులను కోటీశ్వరులను చేయిస్తా' అంటోంది. ఎందుకు ఈ సామెత చెప్పాల్సి వస్తుందంటే ప్రస్తుతం దేశంలో పరిస్థితులు అలాగే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరు చెందిన మల్లేష్ అనే రైతు 2.5 టన్నుల టమాటాల లోడు(Tomoto load truck)ను అమ్ముకోవడానికి ట్రక్కులో కోలార్ బయలుదేరారు. ఈ విషయం గమనించిన తమిళనాడులోని వేలూరుకు చెందిన దంపతులు కారులో ట్రక్కును ఫాలో అయ్యారు. చిక్కజాల వద్ద ట్రక్కును అడ్డగించి రైతుతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో రైతుపై దాడి చేసి ట్రక్కును తీసుకుని పారిపోయారు.
సీసీటీవీ ద్వారా నిందితులు గుర్తింపు.. అరెస్ట్..
అనంతరం చెన్నై వెళ్లి టమాటాలను అమ్ముకుని ట్రక్కును కర్ణాటక సరిహద్దు వద్ద వదిలేశారు. జులై 8న జరిగిన దాడి ఘటనపై రైతు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ద్వారా నిందితులను గుర్తించి తమిళనాడులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను వానియంబాడికి చెందిన భార్యాభర్తలు(Tamilnadu Couple) భాస్కర్ (28), సింధూజ (26)గా గుర్తించారు. ట్రక్కు టమాటాల విలువ రూ.2.5లక్షలుగా ఉంటుందని తెలిపారు. గతంలోనూ మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఓ రైతు దగ్గర 400 కిలోల టమోటాలు దొంగిలించబడ్డాయి. అలాగే తిరుపతి జిల్లాకు చెందిన టమాటా రైతులను దారుణంగా హత్య చేసి వారి వద్ద ఉన్న నగదును దోచుకుని పోయారు.
కూరగాయల షాపుల్లోనూ దొంగతనాలు..
తెలుగు రాష్ట్రాలోనూ టమాటా దొంగలు(Tomoto Robbery) రెచ్చిపోతున్నారు. టమాటా రేట్లు పెరగడంతో కూరగాయల షాపులపై దొంగల కన్ను పడింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని కూరగాయల షాపులో టమటాలను దొంగలించారు. సీసీ కెమెరాల్లో దొంగతనం దృశ్యాలు రికార్డు అయ్యాయి. కొన్నిరోజుల కిందట జహీరాబాద్‌లోని ఓ కూరగాయల షాపులోనూ ఇదేవిధంగా దొంగతనం జరిగింది. షాపు నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. మొత్తానికి కూరల్లో తప్పకుండా వినియోగించే టమాటా ధరలు చిత్రవిచిత్ర ఘటనలకు కారణమవుతున్నాయి. మున్ముందు మరింతగా ధరలు పెరగనున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంకెన్ని దారుణ సంఘటనలు చూడాలో మరి.