మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ ...ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనను పరీక్షించిన వైద్యులు ఏంజీయో గ్రామ్ చేశారు. ట్రిపుల్ వెస్సల్ డిసీస్ ఉందని తేలడంతో...వీలైనంత త్వరగా బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. బుధవారం ఉదయం అరెస్టు అయిన మంత్రి సెంథిల్ బాలాజీ ఛాతినొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ మంత్రిని పరీక్షించిన వైద్యులు...కరోనరీ ఏంజియోగ్రామ్ నిర్వహించారు.
కాగా సెంథిల్ బాలాజీ 2018లో డీఎంకేలో చేరారు. 2011 నుంచి 2015 మధ్య జరిగిన ఉద్యోగాల కుంభకోణంలో సెంథిల్ బాలాజీపై ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ఆయన అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వంలో తమిళనాడు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. సెంథిల్‌పై వచ్చిన నగదు కుంభకోణంపై పోలీసులు, ఈడీ విచారణకు సుప్రీంకోర్టు గత నెలలో అనుమతించింది. గత నెలలో రాష్ట్రంలో బాలాజీకి సన్నిహితంగా ఉండే వ్యక్తుల ఇళ్లలో కూడా ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించడం గమనార్హం.
గతంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కేసులో బాలాజీ తదితరులకు ఈడీ పంపిన సమన్లను మద్రాస్ హైకోర్టు గతంలో రద్దు చేసింది. విద్యుత్, ఎక్సైజ్, ప్రొహిబిషన్ విభాగాలను చూస్తున్న బాలాజీని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అరెస్టు చేశారు. జూన్ 13న అతని నివాసం, ఇతర ఆస్తులపై విస్తృతంగా సోదాలు చేసిన తర్వాత ఈడీ అరెస్టు చేసింది.