Telangana: మంత్రి పదవి ఇచ్చినా అందరినీ మోసం చేశావ్.. తుమ్మలకు పువ్వాడ కౌంటర్..
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.. బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మంత్రి పువ్వాడ.. తుమ్మలపై ఫైర్ అయ్యారు. రౌడీయిజం, గుండాయిజం పెంచి పోషించింది నువ్వు కాదా.. అంటూ ధ్వజమెత్తారు. నువ్వు మంత్రిగా ఉన్న సమయంలో ఎంతమంది రాజకీయ సమాధీ అయ్యారో తెలియదా అంటూ ప్రశ్నించారు. సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు ఇచ్చిన పదవులు పొంది వాళ్లని మోసం చేసి.. చివరికి కేసీఆర్ దగ్గర చేరావని.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లావంటూ ఎద్దేవా చేశారు. ఖమ్మం ప్రజల్ని ఎవరు మోసం చేశారో వాళ్లే ఎన్నికల్లో నిర్ణయిస్తారంటూ వ్యాఖ్యానించారు.