పంద్రాగష్టు వేడుకల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం.. నాటి స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితమే అని పేర్కొన్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా నేల పాడులోని హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. వివిధ మతాలు, వర్గాలు ఉన్నప్పటికీ అందరూ కలిసి స్వాతంత్య్రం కోసం ఏకతాటిపై పోరాడటం వల్లే బ్రిటీష్ వాళ్లను తరిమికొట్టామన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు నిత్యం పహారా కాస్తూ ఉండటం వల్లనే దేశ ప్రజలకు స్వేచ్ఛ కొనసాగుతుందన్నారు. బలమైన రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం కారణంగానే ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడుకుంటున్నామని.. ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. నిరక్షరాస్యత,పేదరికం, అవగాహన, చట్టాలు తెలియకపోవటం వల్ల చాలా మంది తమ హక్కుల్ని కాపాడుకోలేకపోతున్నారని చెప్పారు. ఆర్టికల్ 39 ప్రకారం అందరికీ న్యాయ సహాయం అందేలా చూడాలని చెప్పారు.