Hyderabad : ఆన్లైన్ బెట్టింగ్ గేమ్(Online Betting Game) కు ఓ యువ ఇంజనీర్ బలయ్యాడు. ఈజీ మనీకోసం ఆన్లైన్ గేమ్‌లకు అలవాటు పడిన అతనికి మొదట్లో ఆశ చూపిన కేటుగాళ్లు తర్వాత జేబు ఖాళీ చేయడం మొదలు పెట్టారు. దీంతో ఆందోళన చెందిన యువకుడు వంద నుంచి వెయ్యి ఆ తర్వాత పదివేలు బెట్టింగ్ పెట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే పోయిన డబ్బులు తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. దీంతో ఒకటి రెండుసార్లు వచ్చినట్లే వచ్చి మళ్లీ డబ్బులు పోవడంతో పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాసేందుకు అప్పులు చేశాడు. అవీ సరిపోకపోవడంతో ఆన్ లైన్ లో లోన్లు తీసుకున్నాడు. ఈ విషయం గమనించి తండ్రి హెచ్చరించాడు. అయినా వినకుండా గేమ్స్ కొనసాగించిన కుర్రాడు చివరికీ అప్పులు(Debts) కట్టలేక, పరువుపోయిందనే ఒత్తిడితో ఆత్మహత్య(Suicide) చేసుకున్న ఘటన హైదరాబాద్(Hyderabad) గుడిమల్కాపూర్ ఠాణా పరిధిలో జరిగింది.
అప్పులు తీర్చడంకోసం మరిన్ని బాకీలు..
ఈ మేరకు ఇన్స్పెక్టర్ బైరి రాజు ఎస్సై రాజేందర్‌సింగ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంజిల్లాకు చెందిన శీలం మనోజ్(20) తన కుటుంబంతో హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లోని హీరానగర్‌లో ఉంటున్నాడు. దుండిగల్‌లోని ఓ కాలేజీలో బీటెక్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే గతకొతకాలంగా ఆన్లైన్ గేమ్‌లకు అలవాటు పడిన మనోజ్ భారీగా నష్టపోయాడు. దీంతో పలు యాప్‌ల నుంచి సుమారు రూ. 60,000 అప్పుగా తీసుకున్నాడు. దానిని క్లియర్ చేయడానికి ఫ్రెండ్స్ దగ్గర మరిన్ని బాకీలు చేయడం మొదలు పెట్టాడు. అయితే సకాలంలో బాకీ చెల్లించకపోవడంతో గేమ్ నిర్వాహకులు చేస్తున్న ఫోన్లకు విసిగిపోయాడు. దీనికితోడు ఈ విషయం సన్నిహితులు, బంధువుల ఇళ్లలో తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Modi-Revanth: మొదటిసారి ఒకే వేదికపై మోదీ-రేవంత్.. ఎప్పుడంటే?
లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు..
అయితే గతంలో రూ.3 లక్షల అప్పు తీర్చామని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అప్పు కట్టినప్పటికీ లోన్ యాప్ ఏజెంట్ల(Loan App Agents) వేధింపులు ఆగలేదని, తమ కుమారుడిని వెంట పడి వేధించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో తమకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, లోన్ యాప్ వేధింపుల దావాను ఇంకా ధృవీకరించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అతను తన స్నేహితులతోపాటు వివిధ మార్గాల్లో అప్పులు తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు.’మనోజ్ ఆన్లైన్ గేమ్‌లు(Online Games) ఆడటానికి అలవాటు పడ్డాడు. అతని కుటుంబం హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదు. వివిధ మార్గాల్లో అప్పుగా తీసుకుని ఆట కొనసాగించాడు. ఈ క్రమంలో చాలా డబ్బును పోగొట్టుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నాం’ అని ఎస్ ఐ రాజేందర్ సింగ్ చెప్పారు.