TSPSC Exams: పోటీ పరీక్షల విషయమై విద్యార్థుల్లో తీవ్రమైన సందిగ్ధం నెలకొంది. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా వేలసంఖ్యలో ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్లు ముందుకు సాగలేదు. ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, పరీక్షలు వాయిదా పడడం వంటి పరిణామాలన్నీ వేగంగా జరిగిపోయాయి. దానికి ముందు పేపర్ లీకేజీలతో పరీక్షల రద్దు, ఇంకొన్ని పరీక్షల వాయిదాలతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పటివరకూ గ్రూప్ 4 (TSPSC Group 4), గురుకుల, పోలీసు పరీక్షలు మినహా ఇతర నియామక పరీక్షలేవీ సజావుగా ముందుకు సాగలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ నిరుద్యోగుల సమస్యలకు పెద్దపీట వేయడంతో పాటు తేదీలతో సహా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి వారిని ఆకట్టుకుంది. తాజాగా “కొత్త ప్రభుత్వం స్థిరపడిన తర్వాత పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? అవే నోటిఫికేషన్లను కొనసాగిస్తారా? లేదంటే వాటిని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్లు ప్రకటిస్తారా? టీఎస్పీస్సీ (TSPSC) బోర్డు ప్రక్షాళన ఎప్పుడు?” వంటి ప్రశ్నలతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత సతమతమవుతున్నారు. ఇదిలా కొనసాగుతుండగానే గ్రూప్-2 పరీక్షలకు సెంటర్లను సిద్ధం చేస్తూ టీఎస్పీఎస్సీ సోమవారం ప్రకటన వెలువరించడం తీవ్రంగా చర్చనీయమవుతోంది.
ఇది కూడా చదవండి: మొదటిసారిగా మంత్రులైన భట్టి, పొన్నం, సీతక్క.. మినిస్టర్స్ పొలిటికల్ ప్రొఫైల్స్ ఇవే!
అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన అనంతరం గతేడాది నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ వేలాదిగా ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు వెలువడిన విషయం తెలిసిందే. గ్రూప్-1, 2, 3, 4 పరీక్షలతో పాటు పలు ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, మున్సిపల్ శాఖల్లో ఉద్యోగాలు, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు కూడా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్పీఎస్సీతో పాటు పోలీసు నియామక బోర్డు, గురుకుల నియామక బోర్డు కూడా ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువరించాయి. చాలా కాలంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఎన్నికలకు కొద్దిరోజుల ముందుగానే వెలువడింది. వరుస నోటిఫికేషన్లతో యువత వేలాదిగా హైదరాబాద్‌తో పాటు జిల్లాకేంద్రాలకు వచ్చి లైబ్రరీల్లో పుస్తకాలతో కుస్తీ ప్రారంభించారు. కోచింగ్ సెంటర్లన్నీ అభ్యర్థులతో నిండిపోయాయి. చాలారోజుల తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం రావడంతో ఎలాగైనా సాధించి తీరాలన్న పట్టుదలతో చాలా మంది కుటుంబాలను వదిలి మరీ రాజధానికి చేరుకున్నారు. హైదరాబాద్‌లో అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లలో ఎక్కడ చూసినా విద్యార్థులే కనిపించారు. వీటితోపాటు జిల్లా కేంద్రాల్లో గ్రంథాలయాలు కూడా అభ్యర్థులతో నిండిపోయాయి.
గ్రూప్ 1 పరిస్థితి ఏమిటో!
గతేడాది అక్టోబరు 16న టీఎస్పీఎస్సీ గ్రూప్-1 (TSPSC Group 1) ప్రిలిమ్స్ పరీక్షను తొలిసారి నిర్వహించగా, లీకేజీ వ్యవహారంతో అది రద్దయ్యింది. రెండోసారి ఈ ఏడాది జూన్ 11న తిరిగి పరీక్ష నిర్వహించగా నిర్వహణలోపాలు, ఇతరత్రా కారణాలతో దానిని కోర్టు రద్దు చేసింది. హైకోర్టు సింగిల్ బెంచి, డివిజనల్ బెంచి రెండూ పరీక్షను రద్దు చేయడంతో టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానిపై తీర్పు రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 1న గ్రూప్ 1 ప్రకటిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అంటే, పాత నోటిఫికేషన్‌నే కొనసాగించి మళ్లీ పరీక్ష నిర్వహిస్తుందా? లేదంటే దాన్ని రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ ఇస్తారా? అని అభ్యర్థుల్లో సందిగ్ధం కొనసాగుతోంది. మరోవైపు కోర్టు తీర్పు కూడా పరీక్షపై ప్రభావం చూపే అవకాశముంది. గ్రూప్ 1 మాత్రమే కాదు; ఇతర పరీక్షలదీ ఇదే పరిస్థితి.
జనవరిలో గ్రూప్ 2 జరుగుతుందా?!
గ్రూప్ 1 పేపర్ లీకేజీ అనంతరం జూన్‌లో జరగాల్సి ఉన్న గ్రూప్ 2 (TSPSC Group 2) పరీక్ష ఆగష్టుకు వాయిదా పడింది. అదే సమయంలో గురుకుల బోర్డు నియామక పరీక్షలు, జూనియర్ లెక్చరర్ పరీక్షలు, ఇతర టీఎస్పీఎస్సీ పరీక్షలు కూడా ఉండడంతో వాయిదా కోసం అభ్యర్థులు పెద్దసంఖ్యలో టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళనకు దిగడంతో అది నవంబర్‌కు వాయిదా పడింది. అదే సమయంలో ఎన్నికలకు షెడ్యూలు రావడంతో టీఎస్పీఎస్సీ తిరిగి గ్రూప్ 2 పరీక్షను జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేసింది. ఇప్పుడు ఆ తేదీల్లో పరీక్ష జరుగుతుందా లేదా అన్న సందేహం అభ్యర్థులను వేధిస్తోంది. ఎన్నికల సమయంలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, గ్రూప్ 2 పరీక్ష కోసం సెంటర్లను సిద్ధం చేస్తూ టీఎస్పీఎస్సీ సోమవారం ప్రకటన వెలువరించింది. మరోవైపు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ఏప్రిల్ 1న గ్రూప్ నోటిఫికేషన్ ప్రకటించాల్సి ఉంది. దీనినే కొనసాగిస్తారా లేదంటే రద్దు చేసి కొన్ని పోస్టులు కలిపి కొత్తగా నోటిఫికేషన్ ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పాటై కొద్దిగా స్థిరపడిన తర్వాతే వీటికి సమాధానాలు తెలుస్తాయి.
ఇది కూడా చదవండి: ‘అన్ని విధాలా తోడుగా ఉంటా..’ రేవంత్‌కు మోదీ బెస్ట్ విషెస్!
ఇంకా తేదీలు ప్రకటించని పరీక్షలు ఎన్నో!
గ్రూప్ 3 తో పాటు హెచ్‌డబ్ల్యూవో, రద్దు చేసిన జేఏవో (JAO), డీఎస్సీ (DSC) వంటి పలు పరీక్షలకు ఆయా నియామక బోర్డులు ఇప్పటికీ తేదీలు కూడా ప్రకటించలేదు. వాటిపై సందిగ్ధం ఇప్పట్లో పరిష్కృతమయ్యేలా లేదు. మరోవైపు కాంగ్రెస్ అయితే తన మేనిఫెస్టోలో ఇప్పటికే గ్రూప్ 3, డీఎస్సీలకు తేదీలను కూడా ప్రకటించింది. తర్వాతి పరిణామాలేమిటన్న దానిపై అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
గ్రూప్ 4 ఫలితాలపైనా స్పష్టత రాలేదు. జూలై 1న పరీక్ష జరగ్గా, తుది కీ ని కూడా టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. సర్టిఫికేట్ల పరిశీలన, తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరుగుతుందా!
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రధాన హామీల్లో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఒకటి. హస్తం పార్టీ నాయకులను కలిసిన నిరుద్యోగ యువతకు కూడా వారు అదే హామీ ఇచ్చారు. దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపైనా చర్చలు సాగుతున్నాయి. బోర్డు ప్రక్షాళన జరిగితే ఆ ప్రక్రియకు ఎంత సమయం పడుతుంది? కొత్త సభ్యుల ఎంపిక ఎన్ని రోజుల్లో చేస్తారు? సిలబస్‌లో మళ్లీ మార్పులుంటాయా? బోర్డు ఏర్పాటైన వెంటనే మళ్లీ నోటిఫికేషన్లు వెలువడుతాయా.. ఈ ప్రశ్నలన్నీ పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత మెదళ్లను తొలిచేస్తున్నాయి.
అయితే, ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే వారం పది రోజుల్లో సమావేశమై ఈ అంశాలన్నిటిపై స్పష్టతనిస్తుందని తెలుస్తోంది. అప్పటి వరకూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ సస్పెన్స్ తప్పదు.