Telangana : పోలీసు డిపార్ట్ మెంట్ యాప్ (Police Department Apps) లను హ్యాక్ (Hack) చేసి, అందులోని డేటాను దొంగిలిస్తున్న నిందితుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(TGCSB) పట్టుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీకి చెందిన జతిన్ కుమార్ (20) అనే విద్యార్థి ఇందుకు పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని గ్రేటర్ నొయిడాలో ఉంటూ చదువుకుంటున్న జతిన్.. తెలంగాణ పోలీసుశాఖకు చెందిన ‘హ్యాక్ఐ’ యాప్‌ను హ్యాక్ చేసినట్లు టీజీసీఎస్బీ ఇటీవలే కేసు నమోదు చేసింది. తెలంగాణ పోలీసుశాఖకే చెందిన ‘టీఎస్‌కాప్’ యాప్, ‘ఎస్ఎంఎస్ సర్వీసెస్’లోని డేటాను కూడా అతడే చోరీ చేసినట్లు తెలిపింది.
డేటాను ఆన్ లైన్ లో విక్రయిస్తూ..
ఈ మేరకు దొంగిలించిన డేటాను 150 అమెరికన్ డాలర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల డేటాను కొనుగోలు చేయదలిచినవారు తమను సంప్రదించాలంటూ హ్యాకర్ రెండు టెలిగ్రామ్ ఐడీలను అంతర్జాలంలో పొందుపరిచాడని చెప్పారు. తనను పోలీసులు గుర్తించకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నాడని, టీజీసీఎస్బీ పోలీసులు సోషల్ ఇంజినీరింగ్ విధానాన్ని వినియోగించి హ్యాకర్ జతిన్‌కుమార్ (Hacker Jatin Kumar) ఢిల్లీలో పట్టుకున్నట్లు తెలిపారు.
గతంలోనూ ఈ తరహా సైబర్ నేరాలు..
ఇక జతిన్ ను ఢిల్లీ (Delhi) న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం ట్రాన్సిట్ రిమాండుపై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. విచారణ క్రమంలో నిందితుడు గతంలోనూ ఈ తరహా సైబర్ నేరాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. ఆధార్‌తోపాటు మరికొన్ని కీలక ఏజెన్సీల డేటాను లీక్ చేసినట్లు గుర్తించారు. బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్ పర్యవేక్షణలో కేసును పరిష్కరించినందుకు ఎస్పీలు భాస్కరన్, విశ్వజిత్ కంపాటి, డీఎస్పీలు కేవీఎం ప్రసాద్, సంపత్, ఇన్స్పెక్టర్ ఆశిష్‌రెడ్డి, కానిస్టేబుల్ సురేశ్‌ను డీజీపీ రవిగుప్తా అభినందించారు. పోలీసుశాఖకు చెందిన యాప్‌లు హ్యాక్ అయినా వినియోగదారుల సున్నిత, ఆర్థిక డేటాకు వచ్చిన ఇబ్బందేమీ లేదని డీజీపీ ఒక ప్రకటనలో వెల్లడించారు. తప్పుడు ప్రచారం ద్వారా దర్యాప్తు ప్రక్రియకు ఆటంకం కలిగించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read : కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు.. ఫుల్ లిస్ట్ ఇదే!