ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో విషాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసరలు చేస్తుంటే. మరోవైపు చంద్రబాబు వీరాభిమానులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
వీరాభిమానులు ఆత్మహత్య
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో చంద్రబాబు వీరాభిమాని ఆత్మహత్య. టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తదితర అంశాలను భరించలేక ఇలా చేశాడు. తన అభిమాన నాయకుడు నారా చంద్రబాబునాయుడు అరెస్టు చేశారన్న మనస్థాపనతో కందుకూరు నియోజకవర్గంలో ఓ వీరాభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని టెంకాయచెట్లపాలెంలోని కరేడు గ్రామానికి చెందిన వాయుల సుందరరావు (28) ఈ ఉదయం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
కూలీ పనులకు వెళ్లే సుందరరావు, నారా చంద్రబాబు నాయుడుకి వీరాభిమాని. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుండేవాడు. తాజాగా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయటంతో ఆందోళనకు గురయ్యాడు. నిన్న ఉలవపాడు, కందుకూరులో నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నాడు. అక్కడి నుంచి సొంత ఊరికి వెళ్ళాక కూడా, చంద్రబాబు విషయంపైనే పార్టీ కార్యకర్తలతో చర్చిస్తూ బాధపడ్డాడు.
రాత్రి 9 గంటల వరకు అదే విషయంపై పదేపదే మదనపడ్డాడు. చివరకు ఈ ఉదయం సొంత ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సుందరరావుకు చంద్రబాబునాయుడు అంటే ప్రాణం అని, ఆయన అరెస్టు గురించి టీవీలో చూసినప్పుడు నుంచి ఆవేదనకు గురై చివరికి ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.