ఎన్నికల హడావుడి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. అన్ని పార్టీలు ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఎన్నికల వ్యూహాలు రచిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఓటర్ల జాబితాపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల జాబితా, ఏర్పాట్లు తదితర అంశాలపై దృష్టిసారించారు.
నాయకత్వం వహిస్తున్న లైలా
తెలంగాణలో ఎన్నికల ప్రచారకర్తగా మొదటిసారి ఓ ట్రాన్స్‌జెండర్ నియమితులయ్యారు. వరంగల్‌కు చెందిన లైలాను ఓటుహక్కు వినియోగం, మార్పుచేర్పులపై ప్రచారం చేయించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 వేల 600 మందికిపైగా ట్రాన్స్జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు.
ప్రచార కార్యక్రమాలు
ఈసారి ఎన్నికల నిర్వహణలో ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఈ అరుదైన అవకాశం దక్కింది. తొలిసారిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రచారకర్తగా ఒక ట్రాన్స్‌జెండర్ ఎంపికయ్యారు. సవరణ, మార్పులు, చేర్పులు,ఓటరు నమోదు, ఓటు వినియోగం ప్రయోజనాలు తదితర అంశాలపై ఎన్నికల కమిషన్ ప్రజలను చైతన్యం చేయడానికి ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది. సామాజిక వేత్తలు, సెలబ్రిటీలు, నటులలను తమ ప్రచారకర్తలుగా ఎంపిక చేసి ప్రజల్లో అవగాహన తీసుకొస్తోంది. ఈసారి వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన ట్రాన్స్‌జెండర్ లైలాను ప్రచారకర్తగా ఎంపిక చేసింది.
సమస్యలపై ఎప్పటికప్పడు పోరాటాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 వేల 600 మందికిపైగా ఉన్న ట్రాన్స్జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. వారి సమస్యలపై ఎప్పటికప్పడు పోరాటాలు చేస్తుంది. ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం జిల్లా అధికారులతో మాట్లాడి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వారంలో ఒక రోజు వారికి ప్రత్యేక క్లినిక్‌ను కూడా ఏర్పాటు చేయించారు. అలా వారి కమ్యూనిటీ శ్రేయస్సుకు పాటుపడుతున్న లైలాను.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రచారకర్తగా నియమించింది.