Vijayawada: బుడమేరు వరద ఉద్ధృతి విజయవాడను ముంచెత్తిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా నగరంలోని అనేక ప్రాంతాలు వరద నీటిలోనే నానుతున్నాయి. ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా వరద ఉద్ధృతి కొంచెంగా తగ్గుతుండటంతో నీరు కొంచెంగా తగ్గుతుంది. ఈ ముంపులోనే ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాలను అందిస్తుంది.
బుడమేరుకు గండ్లు పడటం వల్ల విజయవాడ లోకి వరద నీరు ముంచెత్తింది. దీంతో గండ్లను పూడ్చేందుకు ముమ్మరంగా చర్యలు సాగుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రి పగలు తేడాలేకుండా అక్కడే ఉండి గండ్లు పూడ్చే పనులను పర్యవేక్షిస్తున్నారు.ఈ గండ్లు పూడ్చివేత పనుల వివరాలను ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కు తెలియజేస్తున్నారు.
update@ : 2-3AM#ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరు కు పడిన గండ్ల పూడిక పనుల్లో కీలక ఘట్టానికి చేరుకున్నారు.విజయవాడ సింగ్ నగర్ ను ముంపుకు కారణమైన మూడు గండ్లలో రెండు గండ్లు పూడ్చి కీలకమైన మూడో గండికి చేరుకునేలా యుద్ధ ప్రాతిపాదికన పనులు జరుగుతున్నాయి.నిద్రాహారాలు మాని గత 5… pic.twitter.com/myGm1HXDNe
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) September 5, 2024
విజయవాడ సింగ్ నగర్ ముంపునకు కారణమైన ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చేందుకు గత నాలుగు రోజుల నుంచి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అక్కడే ఉండి ఏజెన్సీలతో మంత్రి రామానాయుడు పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేశారు. శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటలకు రెండో గండి పూడ్చివేత పనులను పూర్తి చేశారు. వెంటనే మూడో గండిని పూడ్చివేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆర్మీ ఇంజనీర్ల బృందం కూడా రంగంలోకి వచ్చింది.
సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 40 మంది ఆర్మీ ఇంజనీర్ల బృందంను పంపించింది. అవసరమైతే మరింత మంది ఆర్మీ ఇంజనీర్ల బృందం ఏపీకి రాబోతున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి 40 మంది ఆర్మీ ఇంజనీరింగ్ బృందం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. శుక్రవారం ఉదయం గండిపడిన ప్రాంతానికి ఆర్మీ ఇంజనీర్ల బృందం చేరుకుంది.
ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీతో కలిసి ఆర్మీ బృందం బుడమేరు గండ్లు పూడ్చే పనుల్లో నిమగమైంది. ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం సాయంత్రం వరకు మూడో గండిని కూడా పూడ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి.