Telangana Election: దేశానికి తెలంగాణ మోడల్ దారిచూపుతోందని, సీఎం కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kavitha) స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనన్ని కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆమె తెలిపారు. మహారాష్ట్రలో చేనేత కార్మికులు పడుతున్న బాధలు, కష్టాలు తీరాలంటే తెలంగాణ అభివృద్ధి నమూనానే ఏకైక పరిష్కారమని కవిత అభిప్రాయపడ్డారు.
బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఇటీవల సోలపూర్కు వెళ్లిన కవిత అక్కడి వస్త్ర పరిశ్రమలను సందర్శించి వాటి నిర్వాహకులతో, కార్మికులతో సంభాషించారు. ఆ సంభాషణ సంబంధిత వీడియోను తన ‘సోషల్ మీడియాలో విడుదల చేశారు. మహారాష్ట్రలో వస్త్ర పరిశ్రమలతో పాటు.. ఇతర పరిశ్రమలకు నీటి కొరత, విద్యత్తు కొరత చాలా తీవ్రంగా ఉందని, విద్యుత్ చార్జీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని వారు కవిత దృష్టికి తీసుకొచ్చారు. మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవని వారు చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం వస్త్ర, చేనేత పరిశ్రమదారులు, కార్మికుల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వారు ప్రశంసించారు.
ఈ సందర్భంగా వారితో కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో పవర్ లూమ్ పరిశ్రమలకు సీఎంకేసీఆర్ (cm kcr), కేటీఆర్ అనేక రాయితీలు కల్పిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల కోసం 10 శాతం నీటిని కేటాయించామని, దాంతో పరిశ్రమలకు అవసరమైన నీరు అందుతోందని కవిత తెలిపారు. పరిశ్రమలకు నీటి కొరత, విద్యుత్ కొరత లేకుండా.. సీఎం కేసీఆర్ దూరదృష్టితో అనేక సంస్కరణలు చేపట్టారని కవిత వివరించారు.
ఈ చర్యల వల్ల పరిశ్రమలు నడుపుతున్న వారికే కాకుండా అందులో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని, కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించగలిగామని కవిత స్పష్టం చేశారు. బీడి కార్మికులకు పెన్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, ఇది సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. బతుకమ్మ చీరలను రాజకీయం చేసిన కాంగ్రెస్ పార్టీకి మహిళలు కర్రుకాల్చి వాతపెడుతారని కవిత అన్నారు.