అందరూ ఓటేయాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. అయితే పోలింగ్ మొదలైనా ఓటర్ కార్డులు లేవు. మరికొంత మందికి ఓటర్ స్లిప్పులు రాలేదు. దీంతో తాము ఎలా ఓటు వేయాలో తెలియక తికమక పడుతున్నారు. అలాంటివారు అందరూ ఏం కంగారుపడక్కర్లేదు అని చెబుతోంది ఈసీ. ఓటర్ కార్టు లేకపోయినా ఓటేయొచ్చని అంటోంది. ఓటు వేయడానికి అర్హతగా కొన్ని గుర్తింపు కార్డులను సూచించింది. వాటిల్లో ఏది ఉన్నా ఓటు హాయిగా వేసిరావచ్చని తెలిపింది.
Also read:భర్త పర్సనల్ విషయాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు.. కర్ణాటక హైకోర్టు
ఓటర్ స్లిప్పు రాకపోయినా పర్వాలేదు. దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్ కు వెళ్ళి గుర్తింపు కార్డును చూపిస్తే చాలు ఓటు వేయొచ్చు. పోలింగ్ కేంద్రంలో ఉన్న బీఎల్వోల దగ్గరకు వెళ్ళాలి. వారు ఓటర్ జాబితాలో సరి చేసి ఒక చీటీ మీద క్రమసంఖ్య, పేరు రాసి ఇస్తారు. దాని ప్రకారం వెళ్ళి ఓటు వేసేయడమే. అయితే దానికి గతంలో ఎక్కడకు వెళ్ళి ఓటు వేసారో అక్కడి బీఎల్వోలను కలవాలి. కొత్తగా ఓటు వచ్చిన వారు మాత్రం నమోదు చేసుకున్నప్పుడు ఏ కేంద్రం అని చెప్పారో అక్కడికే వెళ్ళి చీటీ పొందాల్సి ఉంటుంది.
దీంతో పాటూ ప్రభుత్వం జారీ చేసిన ఏ గుర్తింపు కార్డు అయినా పట్టుకెళ్ళి ఓటేయొచ్చు. ఫొటో ఓటరు స్లిప్పు, ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్),ఆధార్ కార్డు, పాసుపోర్టు , డ్రైవింగ్ లైసెన్సు,కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్ సెక్టార్, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డు, బ్యాంకులు, పోస్టాఫీసు జారీ చేసిన పాసుపుస్తకం (ఫొటోతో ఉన్నవి), పాన్‌కార్డు,
జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్‌కార్డు, ఎంఎన్ఆర్జీఏ జారీ చేసిన జాబ్‌కార్డు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డు, ఫొటోతో జత చేసిన పింఛను పత్రాలు,ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం…వీటిల్లో ఏది ఉన్నా కూడా ఓటు వేయడానికి నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. సంబంధిత పోలింగ్ కేంద్రంలో పేరు చెక్ చేయించుకుని ఈ కార్డులను చూపించి ఓటు వేయొచ్చు.
పట్టుకెళ్ళకూడనివి…
ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఈ వస్తువులు కచ్చితంగా పట్టుకెళ్ళకూడదు..ఆ విషయం మాత్రం మర్చిపోకూడదు. సెల్ ఫోన్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించరు. కాబట్టి వాటిని బయటే వదిలేసి వెళ్ళాలి. అలాగే పోలింగ్ కేంద్రాల్లో సిగరెట్ తాగడం, పేలుడు పదార్ధాలను తీసుకెళ్ళడం కూడా నిషేధం.