ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఫ్యామిలీ మర్డర్ల ఇష్యూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఆరు వరుస హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ఆస్తికోసమే తల్లి ఒడ్డెమ్మ సహాయంతో ఈ దారుణానికి పాల్పడ్డట్లు నిందితుడు ప్రశాంత్ అంగీకరించినట్లు కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రశాంత్ ను మీడియా ముందు ప్రవేశ పెట్టగా.. గతంలో తీసుకున్న అప్పు చెల్లించలేక ప్రసాద్ కుటుంబం మొత్తాన్ని చంపేసినట్లు ప్రశాంత్ తెలిపాడు. ప్రసాద్ ఆస్తులను తన పేరిట రిజిస్టర్ చేయించుకుని, తర్వాత ఆ కుటుంబాన్ని హతం చేస్తే ఏ ఇబ్బంది ఉండదనే పక్కా ప్లాన్ తోనే తల్లితో కలిసి ఇదంతా చేశాడని, ప్రశాంత్‌తో పాటు ఒక మైనర్ బాలుడు, మరో ఇద్దరు నిందితులు బానోతు విష్ణు, బానోతు వంశీలను అనే ఇద్దరినీ అరెస్టు చేసినట్లు ఎస్పీ సింధూ వెల్లడించారు.
ఇక 15 రోజుల వ్యవధిలోనే ఈ హత్యలకు పాల్పడ్డ ప్రశాంత్ ముందుగా ప్రసాద్, తర్వాత ప్రసాద్ భార్య రమణి, ఇద్దరు చెల్లెళ్లు శ్రావణి, స్రవంతి, చివరగా ఇద్దరు పిల్లలను హతమార్చగా ప్రసాద్ తల్లి అచూకీ ఇంకా తెలియలేదు.
మొదటి హత్య ప్రసాద్ :
నవంబర్ 29న ఉదయం మాక్లూర్ వచ్చిన రాచర్లకూన ప్రసాద్.. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రశాంత్‌ను నిలదీశాడు. ఇదే అదనుగా భావించిన ప్రశాంత్ ఈ విషయాన్ని వంశీ, విష్ణులకు చేరవేశాడు. దీంతో అదే రోజు నిజామాబాద్ పట్టణానికి వెళ్లిన నిందితులు అక్కడ ఒక కారు రెంటుకు తీసుకున్నారు. సాయంత్ర వరకూ ప్రసాద్ ఇంటికి వెళ్లి డబ్బులిస్తానని నమ్మించి అదే కారులో మాక్లూర్ మండలం మదనపల్లి గ్రామ శివారులో ఉన్న డిచ్పల్లి అటవి ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే చాలాసేపు మద్యం తాగించి మత్తులో ఉండగా కర్రలతో తలపైన కొట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ప్రసాద్ అక్కడికక్కడే మరణించాడు. ఇక అదే రాత్రి నేషనల్ హైవే పక్కనే గోయ్యి తవ్వి ప్రసాద్ ను పూడ్చేశారు. తర్వాత తెల్లవారు జామున ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేశారు.
రెండో హత్య ప్రసాద్ భార్య రమణి :
డిసెంబర్ 1న ప్రసాద్ ప్రస్తుతం ఉంటున్న కామారెడ్డి జిల్లా పాల్వంచ గ్రామానికి ప్రశాంత్ ఒక్కడే కారులో వెళ్లాడు. ఇంట్లో ఉన్న భార్య రమణికి.. ‘ప్రసాద్ కు అప్పులిచ్చినవారు కంప్లై్ట్ చేశారు. ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే నిన్ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకురమ్మన్నాడు’ అని ప్రసాద్ భార్య రమణిని నమ్మించాడు. ఈ క్రమంలోనే దాదాపు 150 కిలోమీటర్లు తిప్పి తిప్పి చివరకు బాసర బ్రిడ్జి వైపు తీసుకెళ్లారు. అక్కడ ఎవరూ కనిపించని ప్రాంతంలో కారు ఆపి రమణి గొంతుకు తాడు బిగించి చంపేశాడు. పూర్తిగా చనిపోయిందని నిర్ధారించుకున్నా తర్వాత ఆమెను బాసర బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలో పడేశాడు.
మూడో హత్య ప్రసాద్ చెల్లెలు శ్రావణి :
ప్రసాద్ కు ఇద్దరు చెల్లెలు కాగా వారి పేర్లు శ్రావణి, స్రవంతి. అయితే నిందుతుడు ప్రశాంత్ ముందుగా నిజామాబాద్ పట్టణంలో ఉంటున్న శ్రావణి దగ్గరకు వచ్చి.. ‘ఓ కేసు విషయంలో ప్రసాద్, రమణీలను పోలీసులు అరెస్ట్ చేయాలని తిరుగుతున్నారు. అందుకే వాళ్లిద్దరినీ రహస్య ప్రాంతంలో ఉంచాను. నిన్ను అక్కడకు తీసుకురమ్మన్నారు’ అని చెప్పి నమ్మించాడు. ఈ క్రమంలోనే వడియారం గ్రామ శివారులో ఎన్‌హెచ్-44 రోడ్ పక్కన నిర్మానుశ్య ప్రాంతంలో కారు ఆపి కారులోనే శ్రావణి గొంతు నులిమి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు.
నాలుగో హత్య ప్రసాద్ మరో చెల్లెలు స్రవంతి:
డిసెంబర్ 13న ప్రసాద్, రమణీలను పోలీసులు అరెస్ట్ చేశారని దివ్యాంగురాలైన స్రవంతి (స్వప్న)ను నమ్మించాడు. ఆమె సోదరి శ్రావణి కూడా అక్కడే ఉందని, వెంటనే తనను తీసుకురమ్మన్నారని నమ్మబలికాడు. ఆ ఆందోళనలో ప్రశాంత్ మాటలను ఏ మాత్రం అనుమానించని స్రవంతి వెంటనే అతనితో బయలుదేరింది. దాదాపు ఆమెను 100 కిలోమీటర్లు తిప్పిన ప్రశాంత్.. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ భూంపల్లి శివారుకు తీసుకెళ్లి మొదట అత్యాచారం చేసి, ఆ తర్వాత గొంతు పిసికి చంపి బాడీని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు.
ఐదు, ఆరో హత్య ప్రసాద్ పిల్లలు :
డిసెంబర్ 14న ప్రసాద్ తల్లి సుశీలమ్మ దగ్గరకు వెళ్లిన ప్రశాంత్.. ప్రసాద్ తీసుకురమ్మన్నాడని మాయమాటలు చెప్పి సుశీలమ్మతోపాటు ప్రసాద్ ఇద్దరు పిల్లలను కారులో ఎక్కించుకున్నాడు. నిజామాబాద్ నుంచి 180 కిలోమీటర్లు నిర్మల్ జిల్లా సరిహద్దులోని సోన్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడు పిల్లలు ఇద్దరినీ గొంతు పిసికి కిరాతకంగా చంపేశాడు. అనంతరం రెండు మృతదేహాలను గోనే సంచిలో కట్టి నిజామాబాద్ – నిర్మల్ సరిహద్దులో ఉన్న సోన్ బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలో పడేశాడు. అయితే సుశీలమ్మ అక్కడినుంచి తప్పించుకుందా లేక చంపి ఎక్కడైన పడేశాడా? అనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసులు ఎలా గుర్తించారు :
ప్రసాద్ చెల్లెలు స్రవంతి మృత దేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం అందించగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ చుట్టుపక్కల ఉన్న 50 కిలో మీటర్ల పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఒక కారు అనేక సార్లు చక్కర్లు కొడుతూ అనుమానాస్పదంగా తిరిగినట్లు గుర్తించి.. ఈ కారు నంబర్‌తోపాటు సెల్‌ఫోన్ సిగ్నల్ డాటాను విశ్లేషించగా ఇందులో ప్రశాంత్ కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా నిజాలన్నీ బయటపడ్డాయి. ఈ హత్యలో ప్రశాంత్ తల్లి (60)తోపాటు 14 ఏళ్ల ప్రశాంతో సోదరుడు, 19 సంవత్సరాల స్నేహితుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
అసలు ఈ కథ ఎలా మొదలైంది:
మాక్లూర్ కు చెందిన ప్రసాద్ తన సొంత ఊర్లో ఉంటున్నపుడు 2018లో అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయి చనిపోయిన విషయంలో ఒక కేసు బుక్ అయింది. దీంతో ప్రసాద్ దుబాయ్ వెళ్లిపోగా అతనిపై కేసు పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో ప్రసాద్ తరచూ ప్రశాంత్ తో మాట్లాడుతూ కేసు వివరాలు, ఊర్లో పరిస్థితిని తెలుసుకునేవాడు. ప్రసాద్ 2022 అక్టోబర్ నెలలో ఇండియాకు తిరిగి వచ్చాడు. అయితే అతనిని మాక్లూర్ పోలీస్ లు అరెస్టు చేసి జైలుకు పంపారు. అంతకు ముందు ప్రసాద్ దుబాయ్ లో ఉన్నప్పుడు ప్రశాంత్ కు దాదాపుగా రూ.3.50 లక్షలు అప్పుగా ఇచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రసాద్ కుటుంబాన్ని గ్రామస్తులు ఊళ్లో ఉండనీయకపోవడంతో ప్రసాద్ అతని భార్య, పిల్లలు, ఇద్దరు చెల్లెల్లు, తల్లితో సహా మాచారెడ్డి పీఎస్ పరిధిలో ఉన్న పాల్వంచ గ్రామానికి వచ్చి ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రశాంత్ ను డబ్బులు అడిగేందుకు మక్లూర్ వెళ్తూ వస్తుండగా ఈ సంఘటనకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుడు ప్రశాంత్ వివరాలు :
ప్రస్తుతం 25ఏళ్ల వయసున్న నిందితుడు ప్రశాంత్ ది పేద కుటుంబమే. అయినా కొత్త కార్లు, బైక్‌లు కొని జల్సాలు చేస్తుంటాడు. చిన్నప్పటి నుంచే అబద్ధాలు చెబుతూ పలువురిని మోసం చేసిన ప్రశాంత్.. భూ లావాదేవీల విషయంలో కొంతమందిని మోసం చేశాడు. వ్యవసాయ భూములకు రుణాలు ఇప్పిస్తానంటూ తన పేరిట ఆస్తులను రాయించుకోవడం.. వాటిని వేరే వ్యక్తులకు అమ్మేయడం అలవాటు చేసుకున్నాడు. అన్యాయంపై ఎదురుతిరిగితే పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందని బెదిరింపులకు పాల్పడేవాడని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.