Akbar – Sita Lions Row: పశ్చిమ బెంగాల్లో రెండు సింహాలకుపెట్టిన పేర్లు పెద్ద వివాదానికి దారి తీశాయి. దీనివలన ఏకంగా ఒక అధికారి ఉద్యోగం పోవడమే కాకుండా..ఇష్యూ కోర్టు వరకూ కూడా వెళ్ళింది. అసలేం జరిగిందంటే..పశ్చిమ బెంగాల్లో శిలీగుడి సఫారీలో రెండు సింహాలకు అక్బర్ (Akbar), సీత (Sita) అని పేర్లు పెట్టారు. వీటిని ఫిబ్రవరి 12న త్రిపురలోని సిపాహీజాలా జూపార్క్ నుంచి తీసుకువచ్చారు. సఫారీలో రెండు సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో పెట్టారు. అయితే వీటి పేర్లు అక్బర్, సీత. ఇవి ఒకటి మగ, ఇంకోటి ఆడ. ఇదిగో ఈ పేర్లే అసలు వివాదానికి అంతటికీ కారణం అయ్యాయి.
పేర్ల మీద పంచాయితీ…
సింహాలకు పెట్టిన పేర్ల మీద విశ్వహిందూ పరిషత్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దీని మీద కొతకత్తా హైకోర్టును (Kolkata High Court) ఆశ్రయించింది. రాష్ట్ర అటవీ అధికారులు కావాలనే సింహాలకు ఆ పేర్లు పెట్టారని ఆరోపించింది. ఈ పేర్లు హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని కేసు పెట్టింది. వెంటనే ఆడ సింహం పేరు మార్చాలని డిమాండ్ చేసింది. ఈ కేసు విచారణ చేసిన హైకోర్టు కూడా సింహాలకు అక్బర్, సీత అనే పేర్లు పెట్టడాన్ని తప్పుబట్టింది. అనవసర వివాదాలు ఎందుకు సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వాటికి పెట్టిన పేర్లు మార్చాలని ఆదేశించింది. వెంటనే బెంగాల్ ప్రభుత్వం కూడా దీని మీద స్పందించింది. సింహాల పేర్లు మారుస్తామని తెలిపింది.
Also Read: National: అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలకు అల్ట్రా లగ్జరీ టెంట్స్..
పాపం అటవీశాఖాధికారి…
ఈ మొత్తం వివాదంలో రాష్ట్ర వైల్డ్‌లైఫ్ ఛీఫ్ అగర్వాల్ (IFS officer Prabin Lal Agarwal) బలయ్యారు. సింహాల పేర్లు వివాదం అవ్వడంతో, కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో..త్రిపుర ప్రభుత్వం చర్యలకు దిగింది. అసలు సింహాలకు అక్బర్, సీత పేర్లు పెట్టింది ఎవరిని కనుక్కుంది. అగర్వాల్ ను వివరణ అడగ్గా…ఆయన తాను పెట్టలేదని చెప్పారు. కానీ తర్వాత డిస్పాచ్ రికార్డులు చెక్ చేస్తే అగర్వాలే రెండు సింహాలకు ఆ పేర్లు పెట్టారని తెలిసింది. దీంతో ఆయనను వెంటనే సస్పెండ్ చేసింది త్రిపుర గవర్నమెంట్.
మొత్తానికి భారతదేశంలో మనుషులకే కాదు…సింహాలకు కూడా మతాలు, కులాలు ఉంటాయి. వాటికి పెట్టిన పేర్లను కూడా పెద్ద వివాదం చేస్తారు. హిందూ, ముస్లిం అంటూ గోలగోల చేస్తాం.