ఒకటో తారీఖు వచ్చిందంటే ముందుగా అందరూ ఎదురుచూసేది ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పుల గురించి. ఇప్పటికే నిత్యవసర వస్తువులు,కూరగాయల ధరల పెరుగుదలతో జనాలు విలవిలాకొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ ధరలు తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనే ఆందోళన ప్రజల్లో ఉంటుంది. గత నెల జూలై 4న చమురు సంస్థలు గ్యాస్ ధరలను సవరిస్తూ కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 7పెంపును ప్రటించాయి. అయితే ఈనెల ఆగస్టు1న కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 100వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
ఇక రెండవది…ఐటీఆర్ ఫైలింగ్. 2022-23 అసెస్మెంట్ సంవత్సరానికి పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేది. అయితే ఈ తేదీ నాటికి రిటర్న్స్ ఫైలింగ్ పూర్తి చేయనివారు ఇబ్బంది పడాల్సిందే. వార్షిక ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉన్న పన్ను చెల్లింపుదారులు రూ. 1000 ఆలస్యంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, మీ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, మీరు రూ. 5,000 ఆలస్యంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, మీరు డిసెంబర్ 31, 2023 తర్వాత ITR ఫైల్ చేస్తే, మీరు రెట్టింపు జరిమానా అంటే రూ. 10,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఆగస్టు 1 నుంచి క్రెడిట్ కార్డ్, క్యాష్‌బ్యాక్, ప్రోత్సాహక పాయింట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు కస్టమర్లకు 1.5 శాతం క్యాష్‌బ్యాక్ మాత్రమేఅందుబాటులో ఉంటుంది. ఈ మార్పు ఆగస్టు 12 నుండి అమల్లోకి వస్తుంది. యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్ కార్ట్ నుంచి కొనుగోలు చేసే వ్యక్తులు ఈ తేదీ నుంచి షాపింగ్ పై తక్కువ క్యాష్ బ్యాక్ ను పొందుతారు.
ఈనెలలో ఇతర మార్పుల గురించి గమనించినట్లయితే…ఎస్బీఐ అమ్రుత్ కలాష్ స్కీంలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ ఆగస్టు 15. ఎస్బీఐ వెబ్ సైట్ లో పేర్కొన్న సమచారం ప్రకారం..ఈ పథకం నాలుగు వందల రోజుల పాటు పెట్టుబడి పెట్టేందుకు కస్టమర్లకు 7.1శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6శాతం వడ్డీ అందిస్తుంది. స్టేట్ బ్యాంక్ అందిస్తున్న ఈ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ అకాల ఉపసంహరణ, డిపాజిట్ సెలెక్షన్ పై రుణ సదుపాయాన్ని కలిగి ఉంటుంది.
ఇక గృహ కొనుగోలుదారులకు శీఘ్ర సమాచారాన్ని అందించడానికి, మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ డెవలపర్లందరినీ వారి అన్ని ప్రకటనలు, ప్రమోషన్లపై ఈరోజు అంటే ఆగస్టు 1 నుండి QR కోడ్లను అతికించాలని ఆదేశించింది. డెవలపర్ ఈ నియమాన్ని పాటించకపోతే, అతను రూ. 50,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.