PM Modi: లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ వేడి నెలకొంది. అధికార, విపక్ష నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. తాజాగా బీహార్‌కు చెందిన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కూతురు మిసా భారతి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే..ప్రధాని మోదీని జైల్లో పెడతామని అన్నారు. దేశంలో జరిగిన ఎలక్టోరల్ బాండ్లు పెద్ద కుంభకోణమని ఆమె ఆరోపించారు. ఇలాంటి అవినీతి పాల్పడిన ప్రధాని మోదీ, బీజేపీ నేతలు జైలుకు వెళ్తారంటూ పేర్కొన్నారు.
Also Read: ఎలా అరెస్ట్ చేస్తారు?.. కోర్టుకు కవిత
ఈ నేపథ్యంలో మిసా భారతి వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. లాలూ ప్రసాద్ యాదవ్ ఆమెకు మిసా భారతి అనే పేరు ఎందుకు పెట్టారో ఆలోచించుకోవాలంటూ విమర్శలు చేసింది. ‘అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం'(MISA) కింద లాలూ ప్రసాద్ యాదవ్‌ను కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టిందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం కోర్టును ఆశ్రయించడం, అలాగే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా ఎవరినైనా.. అరెస్టు చేయొచ్చని తెలిపారు.
ఇది శాశ్వత జైలుకు సంబంధించిన నిబంధన అని సుధాన్షు త్రివేది అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్.. అరెస్టయినప్పుడు ఆ సమయంలో కాంగ్రెస్‌ను నాశనం చేస్తానంటూ ప్రతిజ్ఞ కూడా చేశారని తెలిపారు. అందుకే తన కూతురుకు మిసా అని పేరు పెట్టారని సుధాన్షు త్రివేది అన్నారు. తండ్రి ప్రమాణాన్ని మిసా భారతి ఎగతాలి చేస్తున్నారా ? అలా చేస్తే ఆమె తన పేరును మార్చుకోవాలని వ్యాఖ్యానించారు.
Also Read: సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.1,143 కోట్లు పోగొట్టుకున్న బాధితులు..