తెలంగాణ రాష్ట్రంలోని గవర్నమెంట్ హాస్టల్స్, రెసిడెన్సియల్ స్కూల్స్ లో వసతులు సరిగా లేవంటూ దాఖలైన ఫిటిషన్ పై హైకోర్టు స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తొంభై శాతం గురుకుల పాఠశాలల్లో కనీస వసతులు లేవని, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇది కూడా చదవండి : పార్లమెంట్ లో నిరసనలు.. 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు
ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 9 వేలకు పైగా వసతిగృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు లేవని, ప్రభుత్వం కనీస అవరాలు కల్పించడం లేదని చిక్కుడు ప్రభాకర్ వాదించారు. అలాగే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టం మార్గదర్శకాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే ప్రభాకర్ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో వసతులపై నిపుణులతో కమిటీని నియమిస్తామని హైకోర్టు వెల్లడించింది. వాస్తవ పరిస్థితులను నివేదిక రూపంలో అందించాలని నిపుణుల కమిటీని ఆదేశిస్తామని పేర్కొంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని, రెండు వారాల తర్వాత తదుపరి విచారణను చేపడతామని స్పష్టం చేసింది.