Red Ant Chutney receives GI tag: ఇక మీదట హోటల్స్ లేదా పచ్చళ్ళు అమ్మే వాళ్ల దగ్గర నాన్ వెజ్ పచ్చళ్ళు అయిన చికెన్, మటన్, చేపలు, రొయ్యలు చట్నీలతో పాటూ ఎర్రచీమల పచ్చడి కూడా వడ్డిస్తారు, తయారు చేస్తారు ఇంకా అమ్ముతారు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎర్ర చీమల పచ్చడికి భౌగోళిక గుర్తింపు (GI Tag) లభించింది. ఒరిసా ట్రైబల్ (Odisha Tribal) స్పెషల్ అయిన ఈ పచ్చడి జీఐ ట్యాగ్‌తో ఇప్పుడు మనందరికీ అందుబాటులోకి రానుంది.
ఒరిశా గిరిజనుల ఆహారం..
ఎర్రచీమలతో పచ్చడేంటీ…వాటిని తింటారు కూడానా అని మనకు విచిత్రంగా అనిపించొచ్చు. కానీ ఇది మన దేశంలోనే ఉన్న ఒరిశా రాష్ట్రంలోని గిరిజనుల ఆహారం. వాళ్ళు ఎప్పటి నుంచో ఈపచ్చడిని తింటున్నారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఎర్ర చీమలతో చట్నీ చేస్తారు. ఈ ఎర్ర చీమల పచ్చడిని గిరిజనులు ఎంతో ముఖ్యమైన వంటకంగా ఉపయోగిస్తారు. ఇప్పటికీ ఆదివాసుల్లో ప్రధాన వంటకంగా ఈ ఎర్ర చీమల పచ్చడి ఉంటుంది. ఇప్పుడు ఒడిశాలోని ఎర్ర చీమల పచ్చడికి భౌగోళిక గుర్తింపు లభించింది.
Also Read: రివర్స్ వాకింగ్..దీని వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
కై చట్నీ (Kai Chutney)..
ఎన్న చీమల పచ్చడికి జీఐ ట్యాగ్ ఇవ్వడం వెనుక కారణాలున్నాయి. దీంట్లో.. ఎర్ర చీమల చట్నీలో అనేక పోషక విలువలు ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇందులో ఔషధ గుణాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని గుర్తించారు. అందుకే స్థానికంగా ‘కై చట్నీ’ అని పిలిచే ఈ ఎర్ర చీమల చట్నీకి జీఐ ట్యాగ్‌ను ఇచ్చారు. జనవరి 2వ తేదీ నుంచీ దీనికి భౌగోళిక గుర్తింపు లభించింది.
తయారీ విధానం..
ఎర్ర చీమలను పట్టుకుని దంచి చూర్ణంగా చేసి.. ఎండబెడతారు. అవి ఎండిన తర్వాత ఉప్పు, అల్లం, వెల్లుల్లి, మిరపకాయలు కలిపి మిక్సీ చేసుకుని చట్నీగా తయారు చేస్తారు. ఈ పచ్చడి తింటే దగ్గూ, ఫ్లూ, శ్వాస సమస్యలు, జలుబు, అలసటను తగ్గుతుందని పరిశోధకులుచెబుతున్నారు. ఈ ఎర్ర చీమలు, వాటి గుడ్లలో ఉండే ఫార్మిక్ యాసిడ్.. మానవ జీర్ణ వ్యవస్థలోని చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ ఎర్ర చీమల చట్నీలో జింక్, కాల్షియం, ప్రోటీన్లు ఉంటాయి. ఈ రెడ్ యాంట్ చట్నీ రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తుందనేది పరిశోధకుల మాట.
ఎంటోమొఫాగి..
ఇలా చీయమలు, కీటకాలను ఉపయోగించి పచ్చళ్ళు, వంటకాలు తయారు చేయడాన్ని ఎంటోమోఫాగి అంటారుట. ప్రపంచంలో ఉన్న కొన్ని గిరిజన జాతులు, తెగలలో కీటకాలతో వంటకాలను చేస్తారు. కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి కూడా ఈ పచ్చళ్ళను ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఒరిశా అడవుల్లో రెడ్ వీవర్చీమలు ఎక్కువగా ఉంటాయి. అక్కడి గిరిజనలు వాటిని పట్టుకుని పచ్చడి తయారు చేసి అమ్ముతారు. చాలామందికి ఇదే జీవనోపాధి.