తిరుమల శ్రీవారి లడ్డు నాణ్యత తగ్గుతోందా..!? క్వాలిటీ నెయ్యిస్థానంలో చవుకబారు నెయ్యి శ్రీవారి లడ్డు..లబ్ధ ప్రతిష్ట దెబ్బతీయనుందా.!? లడ్డూ చుట్టూ రాజకీయం అల్లుకుందా అంటే..అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఇప్పుడు రాజకీయం శ్రీవారి లడ్డూ చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది. నెయ్యి కయ్యి బీజీపీ, కాంగ్రెస్ ల ఆదిపత్య పోరుగా మారుతోంది.
తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లి సుదీర్ఘమైన లైన్లో, ఊపిరాడని జనంలో నిలబడి,నెట్టబడి,తోయబడి శ్రమపడి, అష్టకష్టాలు పడి స్వామి దర్శనం చేసుకోగానే అప్పటి వరకు పడిన అవస్థ సగం తుడిచేసినట్టు పోతుంది. దర్శనం అవ్వగానే ఆలయ అర్చకులు మన చేతిలో ఇంత లడ్డు ప్రసాదం పెడతారు.
ఆ లడ్డూ నుంచి వచ్చే సువాసన నోట్లో వేసుకోమని తొందరపెడుతుంది. ఆ పదార్థాన్ని నోట్లో వేసుకోగానే కమ్మగా, తియ్యగా,హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అసలు అమృతం అంటే అదేనేమో అన్న ఫీలింగు..! నిజంగా ఇది నిజంగా మనుషులు చేసిందేనా దేవుడు చేసిందా అనిపిస్తూ ఉంటుంది.
అసులు తిరుపతి శ్రీవారిని దూరం నుంచి చూసైనా తరించి రావొచ్చు కానీ శ్రీవారి లడ్డు ప్రసాదం తినకుండా, కొనకుండా వచ్చారంటే వాళ్లు తిరుపతి వెళ్లడం వేస్టన్నమాటే..!? అంత ప్రాశస్త్యం, ప్రాచుర్యం,అసలు ఆ లడ్డూకి అంత రుచి ఎలా వచ్చిందో ఓ సారి చూద్దాం.
అన్ని ప్రసాదాలు ఒక లెక్క తిరుపతి వెన్న లడ్డూ ప్రసాదం అంటే ఒకలెక్క. ఇది తిరుమల వెంకటేశ్వరుని ప్రసాదాలలో లడ్డూ ప్రధానమైన ప్రసాదం.ఈ లడ్డూకి ఉన్న రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు లేదంటే అతిశయోక్తి కాదు.
అందుకే జీయోగ్రాఫికల్ పేటెంట్ కొట్టేసిందీ లడ్డూ..అంటే దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు అని అర్ధం. తిరుపతిలో ప్రసాదంగా ఇవ్వబడే ఈ లడ్డూ కేవలం ఆహారపదార్థం మాత్రమే కాదు, ఇది శ్రీవారి ప్రతిష్ట, పవిత్రత,భక్తి తత్పరత,ఆత్మస్వచ్ఛత కలగలిసి ఉంటాయి. అందుకే భక్తులు దీన్ని భక్తిప్రపత్తులతో స్వీకరిస్తారు.
ఇక ఈ తిరుపతిలో ఎప్పటి నుంచి ఇవ్వడం మొదలు పెట్టారనే విషయానికి వస్తే..తిరుమల ఆలయంలో ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ళ వరకూ ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం వడకు ఉండేది. అప్పట్లో శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్యవేళలు) ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు.
ఇప్పుడంటే తిరుపతి కొండకు వచ్చే లక్షలాది భక్తులకు వండి వార్చే నిత్యఅన్నదాన సత్రంగా వెలుగొందుతోంది గానీ ..అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు ‘తిరుమల ఆలయ’ నిర్వహణ చూసేరోజుల్లో 19వ శతాబ్ది మధ్యభాగంలో తీపిబూందీ ప్రవేశపెట్టారు.
1940ల నాటికి తీపిబూందీ కాస్తా కమ్మనైన లడ్డూగా మారింది. క్రమేపీ వడ స్థానాన్ని లడ్డు ఆక్రమించుకుంది.అనతి కాలంలోనే భక్తులకు ఇష్టప్రసాదంగా మారిపోయింది. ఈ లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు.
అయితే ఈ లడ్డూ కోసం ప్రత్యేక ప్రత్యేక పదార్థాలు వాడతారు. స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడీపప్పు, కర్పూరం వంటి పదార్ధాలు ఉపయోగించి ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు.
సంస్కృతంలో లడ్డుకము అంటారు..అదే మాట తెలుగులో లడ్డూగా స్థిరపడింది. శ్రీవారి లడ్డూ తయారీకి వాడే సరుకుల మోతాదుని దిట్టం అనిపిలుస్తారు. తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950 లో నిర్ణయించింది. ఏటికి యేడు పెరుగుతున్న భక్తుల సంఖ్యను బట్టి దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు.
దీనినే ‘పడితరం దిట్టం’ స్కేలు అని పిలుస్తున్నారు. పడి అంటే 51 వస్తువులన్న మాట. ఒక పడితరం దిట్టాని 803 కిలోల ముడిసరుకులు(మొత్తం51) వాడితే 5100 లడ్డూలు తయారవుతాయి.
దిట్టంలో ప్రధానమైనవి ఆవు నెయ్యి – 165 కిలోలు, శెనగపిండి – 180 కిలోలుచక్కెర – 400 కిలోలు, యాలుకలు – 4 కిలోలు,ఎండు ద్రాక్ష – 16 కిలోలు, కలకండ – 8 కిలోలు,ముంతమామిడి పప్పు -30 కిలోలు ఉపయోగిస్తారు.
తొలినాళ్లల్లో కట్టెలపొయ్యి మీద రోజుకు సుమారు 15000 వరకూ లడ్డూలు తయారు చేసేవారు. ప్రస్తుతం అత్యాధునికమైన వంట సామగ్రి సహాయంతో ప్రతి రోజూ 500 వందల మంది శ్రమించి లక్షల లడ్లు తయారీ చేస్తున్నారు.
అయితే ఇంత డిమాండ్ ఉన్న అమృతం లాంటి లడ్డూ చుట్టూ అల్లుకున్న చేదునిజం లడ్డూ తయారీ టీటీడీకి తలకు మించిన భారంగా ఉందట.. భక్తులు లడ్డూ ఒక్కింటికీ రూ.25 చెల్లిస్తోంటే తయారీకి మాత్రం రూ. 32.50 ఖర్చవుతోందంట. ఈ నష్టాలను ఆదాయంగా మార్చడానికి టీటీడీ పాలక మండలి రకరకా ప్రయాత్నాలు చేస్తోంది.
టీటీడీ చేస్తున్న ఈ ప్రయత్నంలో కొత్త చిక్కొచ్చి పడింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కీ,టీటీడీకి నెయ్యి నెయ్యం చెడింది. తయారీకి అవసరమైన నెయ్యి మొత్తం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సప్లై చేసేది. గత యాభై ఏళ్లుగా ఫెడరేషన్ సరఫరా చేసే నందిని నెయ్యి మాత్రమే టీటీడీ ఉపయోగించేది.వీరు కూడా లాభాపేక్షతో కాకుండా శ్రీవారికి తమ రాష్ట్రం నుంచి జరిగే సేవగా దీన్ని భావించేవారు.
అయితే తాజా పరిణామా దృష్ట్యా ప్రస్తుతం సిద్ధరామయ్య ప్రభుత్వం గురువారం, కర్ణాటక మంత్రివర్గం నందిని పాల ధర లీటరుకు ₹3 పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఉన్న లీటర్ పాల ధర రూ.39 నుంచి 42 కి పెరుగుతుంది. తమిళనాడులో ఇది రూ. 43 కాగా ఏపీలో రూ.54 నుంచి 56 దాకా పెరుగుతోంది. నెయ్యి కూడా ధర కూడా పెరిగే ఛాన్స్ ఉంది.
పాల ధరపెరిగిన మేరకు నెయ్యిధర కూడా పెరగడంతో లడ్డూ రచ్చమొదలైంది. ఎప్పుడూ ఇచ్చే ధరతో నెయ్యి సప్లై చేయడం కుదరదని కెఎమ్ఎఫ్ తెగేసి చెబుతోంది. టీటీడీ కూడా బింకం మీదే ఉంది.
నాణ్యమైన నందినీ నెయ్యికి ప్రత్యామ్నాయంగా గుజరాత్ ప్రభుత్వం సప్లై చేసే అమూల్ నెయ్యిని ట్రైచేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఇందు కోసం టీటీడీ అఫీషియల్ సైట్ లో పలు సంస్థల నుంచి కొటేషన్ల కూడా ఆహ్వానిస్తోంది.
ఇది మింగుడు పడని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ బీమ నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతర్జాతీయ డిమాండ్ ఉన్న తమనెయ్యికి దిగిరావాల్సిన పనిలేదని. క్వాలిటీలో కాంప్రమైజ్ కాని నందినీ నెయ్యి రేటు విషయంలో రాజీ పడదని చెప్పుకొచ్చారు.
టీటీడీ తక్కవ ఖర్చుతో నెయ్యి కొనాలని చూస్తే ఆ ప్రభావం లడ్డు మీద పడుతుందని ఎత్తిచూపుతోంది. గత యాభై ఏళ్లుగా టీటీడీ శ్రీవారి లడ్డూలో వాడే నెయ్యికి తాము పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలు గీటురాయని వేరే సంస్థలు సప్లై చేసే నెయ్యిలో ఈ ప్రమాణాలు ఉంటాయనేది పాలకమండిలి నిర్ణయించుకోవాలని భీమనాయక్ అన్నారు.
ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండిలి కూడా ధీటుగానే సమాధానమిచ్చింది. కెఎమ్ఎఫ్ ఛైర్మన్ భీమ నాయక్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఇక నుంచి శ్రీవారి లడ్డూ ప్రసారంలో వినియోగించే నెయ్యి ఈ-టెండర్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసేలా నిర్ణయించామన్నారు.
వారు చెప్పినట్టుగా టీటీడీ సంస్థ నేరుగా నందిని నెయ్యి ఎప్పుడూ కొనుగొలు చేయలేదన్నారు. కెఎంఎఫ్ చైర్మన్ చెప్పినట్లు ఇరవై ఏళ్ళుగా వారి నెయ్యి మాత్రమే కొనలేదు..పలు టెండర్ల ద్వారా ఎవరు తక్కువ కోడ్ చేస్తే వారి నుండి కొనుగోలు చేస్తాం.
అది పూర్తిగా టీటీడీ మండలి నిర్ణయాధికారమని గుర్తుచేశారు. నాణ్యత ప్రమాణాలను పూర్తిగా ల్యాబ్ లో పరీక్షించే కొనుగోలు చేస్తామని తెలిపారు. అమూల్ నెయ్యివైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
నిజానికి అమూల్ నెయ్యిని తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం అమూల్ నెయ్యిని దూరం పెట్టింది. ఇంతకు ముందు గవర్నెంట్ వివిధ దేవస్థానాల్లో వాడే ప్రసాదాలకు అమూల్ నెయ్యిని వాడేవారు తాజా పరిణామాల దృష్ట్యా వేరే నెయ్యిని వాడుతోంది.
ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం సప్లై చేసే నందినీ నెయ్యిని నెట్టేసి, జగన్ ప్రభుత్వం స్టాలిన్ ప్రభుత్వం వద్దనుకుంటున్న అమూల్ నెయ్యిని అక్కున చేర్చుకుంటుంది. ఇదంతా చూస్తోంటే ప్రసాదాలకు ఉపయోగించే నెయ్యిలో పొలిటికల్ స్టంట్స్ నడుస్తున్నాయనేది సామాన్యుడి చెవికి చేరని నిజం.
అయితే రైతుల సాధికారత, ప్రత్యామ్నాయ జీవనోపాధి అయిన పాల ఫెడరేషన్ మీద కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం వత్తిడి..రేటు పెరిగేలా చేసింది. దీంతో నెయ్యి రేటు కూడా పెరిగింది, ఆ ప్రభావం శ్రీవారి లడ్డూ మీద పడింది. టీటీడీ లడ్డూ విషయంలో తన ఫ్రీహ్యాండ్ తీసుకుని అమూల్ నెయ్యి కొనేందుకు సిద్ధపడుతోంది.
పొలిటికల్ గేమ్స్ ఎలా ఉన్నా శ్రీవారి లడ్డూకి ఉన్న నాణ్యతా ప్రమాణాన్ని తగ్గించుకుండా కొనసాగించడం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటుకు ఉన్నఅత్యంత పెద్ద సవాలు. అంతేకాదు కోట్లమంది భక్తుల విశ్వాసం.దీన్ని రాజకీయ కోణంలో కాకుండా భక్తుల విశ్వాసకోణంలో చూడటం అనేది సగటు మనిషి మనసులోని మాట.