ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగే సమయాని కన్నా ముందు తాను అప్పటి ప్రధాని పీవీ నరసింహరావుకు కీలక సూచనలు చేశానన్నారు. కానీ మంత్రి హోదాలో తాము ఇచ్చిన సూచనల కన్నా బీజేపీ నాయకురాలు విజయరాజే సిందియా మాటలనే పీవీ ఎక్కువగా విశ్వసించారని ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
సీనియర్ జర్నలిస్టు నీరజా చౌదరి రాసిన ‘హౌ ప్రైమ్ మినిష్టర్స్ డిసైడ్’ అనే పుస్తకాన్ని శరద్ పవార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….పీవీ ప్రభుత్వంలో అప్పుడు తాను కూడా ఒక మంత్రిగా వున్నాని చెప్పారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల సీనియర్ నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని పీవీకి కేబినెట్ సూచనలు చేసిందన్నారు.
బాబ్రీ మసీదుకు ఏమైనా జరిగే అవకాశం ఉందని రక్షణ మంత్రి హోదాలో తాను పీవీని హెచ్చరించానని వెల్లడించారు. కానీ బాబ్రీ మసీదుకు ఏమీ కాదని ఆ సమావేశంలో పీవీతో బీజేపీ నాయకురాలు విజయ రాజే సింధియా అన్నారని చెప్పారు. బాబ్రీ మసీదుకు ఏమీ కాకుండా తాము చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారని పేర్కొన్నారు. కానీ పీవీ తమ హెచ్చరికలను పట్టించుకోకుండా విజయ రాజే సిందియా మాటలను విశ్వసించారని ఆయన గుర్తు చేశారు.
ఆ తర్వాత పలువురు జర్నలిస్టులతో పీవీ చేసిన వ్యాఖ్యాలను నీరజా చౌదరి ప్రస్తావించారు. బాబ్రీ మసీదు కూల్చి వేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని పీవీని జర్నలిస్టులు అడిగారన్నారు. కూలిపోతే కూలి పోనివ్వండని, బీజేపీ తన ప్రచార అస్త్రాన్ని కోల్పోతుందని ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆమె తెలిపారు.